అన్నానగర్ : ఫేస్‌బుక్‌లో తన ఫొటోను ప్రియుడు విడుదల చేయడంతో నర్సింగ్ కళాశాల విద్యార్థిని మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసి ఉంచిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. తేని సమీపంలోని అరన్‌మనై పుదుర్ ముల్‌లైనగర్‌కు చెందిన ధవమణి. ఇతని భార్య తమిళ్‌సెల్వి. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరి రెండో కుమార్తె నర్మద (19). ధవమణి కొన్ని సంవత్సరాల కిందట మృతి చెందాడు. అనంతరం తమిళ్‌సెల్వి టైలర్ పని చేస్తూ తన పిల్లలను పెంచుతూ వచ్చింది. నర్మద ఆండిపట్టిలో ఉన్న ఓ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ స్థితిలో మంగళవారం ఆమె తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. తరువాత ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో నర్మద రాసి ఉంచిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తేని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో నర్మద, ఆమె మామ కుమారుడు ఒక సంవత్సరంగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో నర్మద ఫొటోను ఆమె ప్రియుడు ఫేస్‌బుక్‌లో పెట్టినట్లు తెలిసింది. తన ఆత్మహత్యకి కారణం మామ కుమారుడు, మామ ఇంట్లో ఉన్న కొందరి పేర్లను నర్మద ఆ లేఖలో రాసినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment