
గంగులయ్య మృతదేహం
సిద్దవటం : మండలంలోని వెంకటాయపల్లెకు చెందిన రైతు జ్యోతి గంగులయ్య (70) నీటి గుంతలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగులయ్య తాను సాగు చేసిన వేరుశెనగ పంటకు శనివారం సాయంత్రం నీరు పెట్టేందుకు వెళ్లాడు.
బోరులో నుంచి మోటారు ద్వారా వచ్చే నీరు దునికే ప్రదేశంలో గుంత ఉండటంతో.. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయాడు. ఆయన బయటకు రాలేక పోవడం, చుట్టు పక్కల పొలాల్లో రైతులెవరూ చూడక పోవడంతో ఊపిరాడక చనిపోయాడు.
ఆదివారం ఉదయం పక్క పొలం రైతు ఈరిశెట్టి వెంకటసుబ్బయ్య తిరుగుతుండగా.. గంగులయ్య నీటి గుంతలో పడి ఉండటంతో వెళ్లి పలకరించాడు. ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చనిపోయినట్లు గ్రహించాడు.
వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపాడు. వారు వచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని వీఆర్‌వో చక్రధర్ పరిశీలించి తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment