
సాక్షి, హైదరాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లలో కొట్టి , ఆమెను గాయపరిచి నగలు, నగదు చోరీచేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఇంటి అల్లుడే ఈ పనిచేశాడని నిర్ధారించారు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసీనగర్‌లో నివసించే ఆంటోనమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో గత నెల 31వ తేదీన చోరీ జరిగింది. ఇంట్లో జోరబడి ఆంటోనమ్మపై దాడిచేసి కొట్టడమేకాక, ఆమె కళ్లలో కారంకొట్టి ఇంట్లోని 20 తులాల బంగారు నగలు, నగదు దోచుకెళ్ళారు. ఈ సంఘటనపై వృద్ధురాలు ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆంటోనమ్మ అల్లుడు హ్యారిని దొంగగా తేల్చారు.
ఇంట్లో నగలు, నగదు ఉన్న సంగతి పసిగట్టిన హ్యారీ ఎవరూ గుర్తిపట్టకుండా ముఖానికి ముసుగు వేసుకుని ఇంట్లో జొరబడి అత్త ఆంటోనమ్మను చితకబాదాడు, ఆమె ప్రతిఘటించడంతో ఆమె కళ్లలో కారంపొడి కొట్టాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోగా బీరువాలో ఉన్న నగలు, నగదు తీసుకుని ఉడాయించాడు. వృద్ధురాలి ఫిర్యాదుమేరకు అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా తనే దొంగతనం చేసినట్లు హ్యారీ అంగీకరించాడు. దాంతో హారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.