అనంతపురం – కదిరిరహదారిపై ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. దైవదర్శనానికివెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ముదిగుబ్బ/ బత్తలపల్లి: అనంతపురం పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ గీత, ఆమె భర్త జయరామిరెడ్డి(55), కుమారుడు రోహిత్‌రెడ్డితో కలిసి శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో తిరుపతికి కారులో బయల్దేరారు. రాములు అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక డ్రైవర్ స్థానంలోకి రోహిత్‌రెడ్డి వచ్చాడు. అలా ముందుకు సాగిపోతున్న సమయంలో వీరి కారు ముదిగుబ్బ మండలం రాళ్లనంతపురం క్రాస్– జొన్నలకొత్తపల్లి గ్రామాల మధ్యలోకి రాగానే కదిరి వైపు నుంచి తాడిమర్రి మండలం దాడితోటకు చెందిన సునీత, రాజశేఖర్‌లు వస్తున్న కారును ఎదురుగా ఢీకొంది.
కార్లలో ఇరుక్కుపోయినక్షతగాత్రులు
వేగంగా ఢీకొనడంతో రెండు కార్లూ నుజ్జునుజ్జయ్యాయి. ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సుదర్శన్‌నాయుడు సంఘటనాస్థలానికి చేరుకొని కార్లల్లోనే ఇరుక్కుపోయిన క్షతగాత్రులు జయరామిరెడ్డి, సూపరింటెండెంట్ గీత, డ్రైవర్ రాములు, సునీతలను స్థానికుల సహకారంతో బయటికి తీశారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులూ అక్కడికి చేరుకుని 108 వాహనంలో వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. జయరామిరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాములు, సునీతలను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఇదిలా ఉండగా రెండు కార్లలోనూ డ్రైవింగ్ చేస్తున్న వారికి ఎటువంటి గాయాలూ కాకపోవడం గమనార్హం. మృతుడు జయరామిరెడ్డి స్వస్థలం కనగానపల్లి మండలం భానుకోట. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముదిగుబ్బ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి మరొకరు..
పరిగి: ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పరిగి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ రాంభూపాల్ తెలిపిన మేరకు.. హిందూపురానికి చెందిన లక్ష్మీనరసింహులు (45), శ్రీధర్ మడకశిరలోని ఓ బార్‌లో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి పనులు ముగించుకొని హిందూపురానికి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పరిగిలోని సీతారాంపురం కాలనీ వద్దకు చేరుకోగానే ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే లక్ష్మీనరసింహులు మృతి చెందాడు. శ్రీధర్ కోలుకుంటున్నాడు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment