
భవ్యాసింగ్
హైదరాబాద్: అతి వేగంతో ఓ కారు రోడ్డు పక్కన గుడారాల్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హయత్‌నగర్‌కు చెందిన భవ్యతేజారెడ్డి (27), రహీం(24)లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి కారు(టీఎస్08ఈహెచ్ 9995)ను అతి వేగంగా నడుపుతున్నారు. వనస్థలిపురం నుంచి హయత్‌నగర్ వెళ్తుండగా ఆటోనగర్ జింకలపార్కు వద్దకు రాగానే అక్కడ రోడ్డు పక్కన గుడారాల్లో నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది.
ప్రమాదంలో భవ్యాసింగ్ (34) అక్కడికక్కడే మృతి చెందగా, మాన్‌సింగ్ (25), ఈశ్వర్‌లాల్ (30), రాంసింగ్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తితోపాటు గాయపడిన వారంతా రాజస్థాన్‌కు చెందిన వారని, వీరంతా బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారని స్థానికులు తెలిపారు. కారు నడుపుతున్న భవ్యతేజారెడ్డి, రహీంలు మద్యం మత్తులో ఉన్నారని, వారిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుధాకర్ రావు తెలిపారు. క్షతగాత్రుల్లో రాంసింగ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.