రైల్వే బ్రిడ్జిపై పడిపోయిన దన్నాన సన్యాసిరావు మృతదేహం
బొబ్బిలి రూరల్/దత్తిరాజేరు: రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు వారు... ప్రతి రోజూ ఒకే ఊరి నుంచి 3, 4 ఆటోలలో 45 మంది వరకు కలిసి వేకువజామునే క్యారేజీలు కట్టుకుని వచ్చి రైల్వే పనులు చేస్తుంటారు. మరో 15 రోజులలో పండగ వస్తోందని ఆశతో అందరూ పనిచేసుకుపోతున్నారు. పనిచేసే ప్రదేశం వద్ద రైలు లేదా గూడ్స్ వచ్చే సమయంలో హెచ్చరికగా జెండాలు ఊపుతూ అంతా అప్రమత్తంగా ఉంటారు. రైలుబళ్లు కూడా వేగం తగ్గించి పని ప్రదేశంలో వెళ్తాయి. కాని గురువారం వారి ఆశలు ఆవిరయ్యాయి. రైలు బండి రూపంలో వారి బతుకులు ఛిద్రం అయ్యాయి...మండలంలోని పెంట రైల్వే బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన దన్నాన సన్యాసిరావు(44) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన మృతుడికి వరుసకు సోదరుడయ్యే పతివాడ రాము కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే దన్నాన అన్నపూర్ణమ్మ భయంతో బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో తీవ్రంగా గాయపడింది.
అసలేం జరిగింది.....?
స్థానికులు, బాధిత కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన 45 మంది సుమారు 30 సంవత్సరాలుగా రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం పెంట బ్రిడ్జిపై పనులు చేపట్టారు. ట్రాక్ పనులు చేస్తుండగా ఉదయం 9.30 గంటల సమయంలో విశాఖ నుంచి రావాల్సిన విశాఖ–రాయఘడ డీఎంయూ గంట ఆలస్యంగా 10.30గంటలకు వచ్చింది. వేగంగా రైలు వస్తుండడంతో çపనులు జరుగుతున్నట్లు కార్మికులు హెచ్చరిక జెండా ఊపారు. అయినా రైలు వేగంగా వచ్చి దన్నాన సన్యాసిరావును ఢీ కొట్టింది. దీంతో అతని శరీరం ఛిద్రమై బ్రిడ్జి పిల్లర్ల మీద పడిపోయింది. ఈ సమయంలో అక్కడేపనిచేస్తూ పరుగుతీçస్తున్న పతివాడ రామును కూడా రైలు ఢీకొనడంతో తలకు తీవ్రగాయమైంది. ఈ ఘటనలో భయబ్రాంతులకు గురైన దన్నాన అన్నపూర్ణమ్మ బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో సుమారు 25 నుంచి 30 అడుగుల ఎత్తునుంచి కిందపడడంతో ఆమె కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు.
భార్య కళ్లెదుటే...
మృతుడు సన్యాసిరావుకు భార్య రమణమ్మ, కుమార్తెలు దివ్య, ఉష ఉన్నారు. రమణమ్మ కూడా గురువారం భర్తతో పాటే పనిచేస్తోంది. తన కళ్లెదుటే భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు టెన్త్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. తీవ్రంగా గాయపడిన పతివాడ రాముకు భార్య చిన్నమ్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తీవ్రంగా గాయపడిన అన్నపూర్ణమ్మ భర్త గతంలో మృతి చెందగా ఆమెకు పార్వతి అనే ఒక కుమార్తె ఉంది. వీరంతా గ్రామానికి చెందిన ఎస్.బంగారునాయుడు ఆధ్వర్యంలో రైల్వే పనులు చేస్తున్నారు. సన్యాసిరావు మృతదేహాన్ని అతికష్టం మీద బ్రిడ్జి పిల్లర్ల మీద నుంచి తీసి రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎంకే మీనా, ఎస్సై జీపీ రాజు, ఏఎస్సై వీఆర్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ ఈ.కేశవరావు, వీఆర్‌ఓ రవి, అప్పారావుల సమక్షంలో శవపంచనామా చేసి బొబ్బిలి సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మిన్నంటిన ఆర్తనాదాలు...
ప్రమాదం జరిగిన ప్రదేశంలో కోరపు కృష్ణాపురం గ్రామస్తులతో పాటు మృతుడు సన్యాసిరావు కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోదించడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎప్పుడూ ట్రాక్‌లపై పనిచేసే తాము ప్రమాదాలను పసిగడతామని... 30 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన ట్రైన్ 120 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు సుమన శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే దిగ్భ్రాంతి....
సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన దురదృష్టకరమని, బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment