
ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం రూరల్ : ఒకే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. లోబరుచుకుని కులం పేరుతో దూషించి చివరకు ముఖం చాటేశాడో ఏఆర్ కానిస్టేబుల్! సుమారు ఆరు సంవత్సరాలు ఈ కేసు వివిధ స్థాయిల్లో విచారణ చేపట్టిన అనంతరం ఎట్టకేలకు న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఏఆర్ కానిస్టేబుల్‌కు ఏడాది జైలు శిక్షణ విధించింది.
ఈ కేసుకు సంబంధించి సోమవారం రాత్రి జిల్లా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్రీకాకుళం నగర పరిధిలోని గొంటివీధికి చెందిన కొర్లకోట తులసీబాయ్ హోంగార్డుగా శ్రీకాకుళంలోనే ప్రస్తుతం పనిచేస్తోంది.
జి.సిగడాం మండలం మదపాం గ్రామానికి చెందిన సెగళ్ల రాజు ఏఆర్ కానిస్టేబుల్‌గా జిల్లా సబ్‌జైల్‌లో 2013లో పనిచేస్తుండేవారు. అక్కడే తులసీబాయ్ కూడా హోంగార్డుగా పనిచేసేవారు. అక్కడే వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఈ విషయం కాస్తా అందరికీ తెలిసిపోవడంతో పెళ్లి చేసుకోవాలని రాజును తులసీబాయ్ కోరింది.‘నువ్వు ఎస్సీ కుటుంబానికి చెందిన దానివి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా కుటుంబం రోడ్డున పడుతుంది’ అని రాజు ముఖం చాటేశాడు. దీంతో 2013లో ఆమె టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాజుపై ఫిర్యాదు చేసింది.
టూటౌన్ సీఐ రాధాకృష్ణ కేసు నమోదు చేశారు. ఎస్సీఎస్టీ డీఎస్పీ సి.హెచ్.పెంటారావు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ కేసును రాజీ కుదిర్చేందుకు రాజు తీవ్రంగా శ్రమించారు. తనకు చెల్లి ఉందని, ఆమెకు వివాహం చేసేందుకు రెండేళ్లు సమయం కావాలని తులసీబాయ్‌ని కోరారు.
తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఆమె రెండేళ్లు ఎదురుచూసింది. అయినా ఆమెకు నిరాశే ఎదురైంది. ఈ విషయం తెలియడంతో ఎస్పీ ఖాన్ హయాంలో ఆయన్ను ఆరు నెలలు సస్పెండ్ చేశారు. సుమారు ఆరేళ్లు ఈ కేసు వివిధ స్థాయిల్లో తిరిగి చివరకు ఓ కొలిక్కి వచ్చింది.
సోమవారం ఈ కేసును పిపి ఐ.నాగమల్లేశ్వరరావు వాదించగా జడ్జి వి.గోపాలకృష్ణ విచారణ అనంతరం సెగెళ్లరాజుకు ఏడాది పాటు సాధారణ కారాగార జైలు శిక్షణ విధించినట్లు కోర్టు లైజన్ ఎస్‌ఐ జగన్నాథరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment