గుంటూరు కృష్ణానగర్‌లోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ
సాక్షి, అమరావతి : జిల్లాలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీల్లో మందుల కొనుగోళ్ల అక్రమ దందా బట్టబయలవుతోంది. అవసరం లేకున్నా అధిక ధరలకు, ఇండెంట్లు లేకుండా మందులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజిలెన్స్ ఎస్పీ జాషువా నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో రికార్డులను పరిశీలిస్తున్నాయి.
రికార్డుల స్వాధీనం..
2014 నుంచి ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో కొనుగోలు చేసిన మందుల వివరాలను ఆరా తీస్తున్నారు. సాధారణ వ్యాధులకు సంబంధించి ప్రధానంగా బీపీ, çషుగర్, జ్వరాలకు ఇచ్చే పారాసిట్మాల్ మాత్రలు కాకుండా అధిక ధరలు ఉన్న మందులు కొన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో శనివారం నుంచి పెదకాకాని, ఉండవల్లి, మాచర్ల, చిలకలూరిపేట గణపవరం, గుంటూరు నగర పరిధిలో పొత్తూరువారితోట, దేవాపురం, నల్లపాడు ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. పిడుగురాళ్ల, సత్తెనపల్లి్ల, దాచేపల్లి్ల, మంగళగిరి, బాపట్ల, తెనాలి ఆస్పత్రుల రికార్డులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిని పరిశీలించేందుకు దాదాపు వారానికి పైగా సమయం పడుతుందని అంచనా.
మాయాజాలం..
విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో అత్యవసర మందులు, సాధారణ మందులను అధిక ధరకు కొనుగోలు చేసి కొందరు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రక్తపరీక్షలకు వాడే దీప రియోజంట్ల సరఫరా నిలిచిపోవడంతో పాటు ప్రధానంగా అత్యవసరంగా వినియోగించే సర్జికల్ డిస్పోజల్స్‌ను స్థానికంగా 10 రెట్లు అధిక ధరలకు కొని సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికి తోడు ఆస్పత్రుల్లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లలో సైతం దండుకొన్నట్లు తెలుస్తోంది. అవి ప్రస్తుతం పనిచేయక మూలనపడ్డాయి. వీడియో కాన్ఫరెన్స్ కోసం కొనుగోలు చేసిన ఎల్‌సీడీ టీవీలది కూడా ఇదే దుస్థితి. వీటన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసి విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment