నుజ్జునుజ్జు అయిన బస్సు ఎడమవైపు బెర్త్‌లు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కావలి: ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కునికి పాటు ముగ్గురి ప్రయాణికులు గాఢ నిద్రలో నుంచే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. బస్సు స్లీపర్ బెర్త్‌లో నుంచి నడిరోడ్డుపై శవాలుగా మిగిలారు. కావలి సమీపంలో గురువారం తెల్లవా రు జామున ప్రైవేట్ ట్రావెల్స్ సృష్టించి మరణ మృదంగం మూడు కుటుం బాల్లో తెల్లారకుండానే తీరని విషాదా న్ని మిగిల్చింది. పోలీసులు, రవాణాశాఖాధికారులు సమాచారం మేరకు.. అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన ఆరెంజ్ ట్రావ్సెల్‌కు చెందిన వొల్వొ ఏసీ స్లీపర్ బస్సు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరింది. ఈ బస్సు గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సి ఉంది. 34 స్లీపర్ బెర్త్‌లు కలిగిన బస్సులో ఒక సీటును ప్రయాణికుడు రద్దు చేసుకున్నాడు. 33 మందితో బస్సు బెంగళూరుకు వెళ్తూ గురువారం తెల్లవారు జూమున 2 గంటలకు కావలి సమీపంలోని మద్దూరుపాడు వద్దకు వచ్చే సరికి ఫ్లైఓవర్ వంతెన ఎక్కే సమయంలో ప్రమాదానికి గురైంది.
తాడేపల్లిగూడెం నుంచి రొయ్యల మేతలో కలిపేందుకు వాడే పామాయిల్ వేస్ట్ పౌడర్ లోడుతో తమిళనాడులోని నమక్కల్‌కు వెళ్తున్న లారీ బ్రిడ్జి ఎక్కే సమయంలో బస్సు లారీ వెనుక భాగంలో ఢీకొంది. బస్సులో ఎడమ వైపున లోయర్ స్లీపర్ బెర్త్–1, అప్పర్ స్లీపర్ బెర్త్–1, దాని వెనుకనే ఉన్న లోయర్ స్లీపర్ బెర్త్–4 ల్లో నిద్రపోతున్న విశాఖపట్నంకు చెందిన సామవేదం సూర్యకుమారి (65), విజయవాడకు చెందిన తాడినాడ ప్రణీత్ (20), రాజమండ్రికి చెందిన ముమ్మడివరం పట్టాభి రామదాసు (57) దుర్మరణం పాలై రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డారు. మృతదేహాలను కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించా రు. కావలిరూరల్ సీఐ టి అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఎస్సై జి.పుల్లారావు, ఏఎస్‌ఐలు సీహెచ్ తిరుమలరెడ్డి, దాసుతో పాటు ఇతర సిబ్బంది బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించారు. కావలిరూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొనకుంటే..
ఘటనా స్థలాన్ని చూస్తే పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు, పోలీసులు, రవాణా శాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ కునుకు తీయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొనకుండా ఉంటే వంతెన గోడ ఢీకొని ఆ వేగంలో పైనుంచి కింద పడేదని, అలా కాకుండా మరో చోట అయినా పెను ప్రమాదమే జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రమాదం జరిగిన బస్సు డ్రైవర్ వెంపల గిరీష్‌కుమార్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. విజయవాడుకు చెందిన గిరీష్‌కుమార్ రెండు నెలలు క్రితమే ఆరెంజ్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా చేరాడు. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు మరో డ్రైవర్ బస్సును నడిపాడు. విజయవాడ నుంచి గిరీష్‌కుమార్ బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతేడాది జనవరిలో ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి విశాఖపట్టణం వెళ్తూ చిత్తూరు వద్ద ప్రమాదానికి గురై ముగ్గురు చనిపోయారు. ఇప్పడు అదే ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళ్తూ ప్రమాదానికి గురై మృతికి కారణమైంది. జనవరి నెల ఆరెంజ్ ట్రావెల్స్‌కు అచ్చిరాలేదని బస్సు సిబ్బంది అభిప్రాయపడ్డారు.
‘ఉదయాన్నే బస్సు దిగి కాల్ చేస్తా’
ఈ ప్రమాదంలో మృతి చెందిన తాడినాడ ప్రణీత్ (20) విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్‌సీ బ్రాంచ్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రణీత్ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బస్సు ఎక్కి విజయవాడ పటమట ఆంధ్రాబ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రామకృష్ణకు ఫోన్‌చేసి ‘డాడీ ఇప్పుడే బస్సు ఎక్కాను. ఉదయాన్నే తిరుపతిలో బస్సు దిగి కాల్ చేస్తాను’ చెప్పాడు. బస్సు దిగకుండానే ఆ తండ్రికి కుమారుడి మరణ వార్త చేరింది. రామకృష్ణ, ఆయన సతీమణి కావలి ప్రభుత్వ ఏరియా వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
మాకు దూరం కావడానికే బెర్త్ మారలేదు..
బస్సులో ఎడమ వైపు లోయర్ స్లీపర్ బెర్త్–1లో ఉన్న ప్రణీత్‌ను క్లీనర్ మరొక ప్రయాణికుడు ఆ బెర్త్‌లో నిద్రపోతారని, కుడి వైపున ఉన్న అప్పర్–5 లోకి మారాలని నచ్చచెప్పాడు. ఎప్పుడూ ఎవరో ఒకరికి తన బెర్త్‌ను ఇచ్చే ప్రణీత్ ఈ సారి మాత్రం తాను మరో బెర్త్‌కు మారనని చెప్పాడు. బెర్త్ మారి ఉంటే ప్రణీత్ ప్రాణాలతో ఉండేవాడు. ఇదే విషయాన్ని తండ్రి రామకృష్ణ చెబుతూ ఎప్పడూ తన సీటును బామ్మకు ఇచ్చి వేరే సీటుకు మారానని, తాతకు ఇచ్చి మారానని, ఆంటీకి ఇచ్చి సీటు మారానని చెప్పే నా బిడ్డ ఈ సారి మాత్రం మా నుంచి దూరం కావడానికే సీటు మారననని మొండికేశాడని కన్నీటిపర్యంతమైయ్యాడు. తిరుపతిలోఎస్వీ యూనివర్సిటీలో జరిగే కాన్ఫరెన్స్‌కు తన కుమారుడితోపాటు మరో ఇద్దరు గీతం విద్యార్థులు ఎంపిక కావడంతో, అందులో పాల్గొనేందుకు విశాఖపట్నం నుంచి తిరుపతికి బయలుదేరి తమ నుంచి శాశ్వతంగా దూరం అయ్యాడని ప్రణీత్ తల్లిదండ్రులు గుండలవిసేలా రోదించారు.
నాగూర్ నాగపట్నం సందర్శిద్దామని..
సామవేదం సూర్యకుమారి (65) సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ మరదలు. ఆమె విశాఖపట్నంలో ఉంటారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చారు. అక్కడున్నుంచి సోదరి, ఆమె మనవడుతో కలిసి రాత్రి 9 గంటలకు ఏలూరులో బస్సు ఎక్కారు. బెంగళూరులో బంధువులు ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం తమిళనాడులోని నాగూర్‌నాగపట్నంను సందర్శించాలని బయలదేరారు. కావలి వద్ద జరిగిన ప్రయాదంలో సూర్యకుమారి మృతి చెందడటంతో ఆమె సోదరి ధీనంగా విలపించింది.
భార్య, కొడుకు వద్దకు వెళ్తూ..
ప్రమాదంలో మృతి చెంది న ముమ్మడివరం పట్టాభి రామదాసు (57)ది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. అదే జిల్లాలోని కొత్తపేట డివిజన్ పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొడుకు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటుండటంతో అతని భార్య కూడా అక్కడే ఉంటుంది. వారిని చూడటానికి రాజమండ్రిలో బస్సు ఎక్కిన రామదాసు గమ్యం చేరకుండానే, భార్య, బిడ్డను చూడకుండానే అంతర్థమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment