రక్తపు మడుగులో సునీత మృతదేహం, లంక సునీత (ఫైల్)
సాక్షి, మహబూబాబాద్ రూరల్: అనుమానంతో భార్యను అంతమొందించిన ఘటన మహబూబాబాద్ పట్టణ శివారు పత్తిపాకలో బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ సుంకరి రవికుమార్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణ శివారులోని పత్తిపాకకు చెందిన మునిసిపాలిటీ శానిటేషన్ వర్కర్ లంక రాముకు వరంగల్ దేశాయిపేటకు చెందిన పల్లపు సునీత(30)తో 11 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కవల కుమారులు నాగేంద్ర, నరేంద్రలున్నారు. పెళ్లయిన నెల రోజులకే రాము అనుమానంతో భార్య సునీతపై కిరోసిన్ పోసి చంపబోయాడు. ఆ సమయంలో ఆమె తన తల్లి గారింటికి వెళ్లింది. కొద్ది రోజులు అనంతరం రాము దేశాయిపేటకు వెళ్లి తన భార్యను మంచిగా చూసుకుంటానని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చెప్పి సునీతను మహబూబాబాద్‌కు తీసుకెళ్లాడు.
కానీ ఆ సమయంలో రాము ఏదో ఓ రోజున అఘాయిత్యానికి పాల్పడుతాడని మృతురాలి తల్లి ఎలిషా అనుమానం వ్యక్తం చేసింది. అనంతరం చిన్న చిన్న తగాదాల నడుమ భార్య, భర్తలు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ విషయాలన్నీ సునీత తన తల్లికి చెబుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఏమి జరిగిందో ఏమో కానీ లంక రాము తన భార్య లంక సునీతను రాత్రి 10:30 నుంచి 11 గంటల సమయంలో కొట్టాడు. సునీత గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు ఇంటికి వెళ్లి చూసేసరికి గేటుకు తాళం వేసి ఉంది. రాము స్థానికులపై అరవడంతో వారు లోపలకు వెళ్లలేకపోయారు. అనంతరం సునీతను క్రికెట్‌బ్యాట్‌తో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను అక్కడే ఉన్న టేబుల్ ఫ్యానుకు గల వైర్‌ను తొలగించి ఆ వైరుతో ఆమె మెడకు ఉరి వేసి కిరాతకంగా చంపాడు. కొంత సేపటి తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
అదే ప్రాంతంలో నివాసం ఉండే సునీత పిన్ని అక్కడకు వచ్చి చూసి జరిగిన విషయాన్ని మృతురాలి తల్లి ఎలిషాకు ఫోన్ చేసి చెప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టౌన్ సీఐ సుంకరి రవికుమార్, ఎస్సై సీహెచ్.అరుణ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ సువర్ణబాక వెంకటరమణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి పల్లపు ఎలిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సునీత మృతితో పత్తిపాకలో విషాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment