ఒడిశా, జయపురం: ధనాశకు తలొగ్గిన తల్లిదండ్రులు సొంత కూతురినే అమ్మకానికి పెట్టారు. రూ.3 లక్షలకు కన్నపేగును తెంచుకునేందుకు సిద్ధపడ్డారు. నవరంగపూర్ జిల్లాలోని పపడహండి సమితి నివాసి అయిన ఓ యువతిని హర్యానా రాష్ట్రంలో విక్రయించినట్లు సమాచారం. ఈ విషయంపై స్వయంగా బాధితురాలే కన్నీరుమున్నీరై విలపిస్తే తప్ప విషయం బయటకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను హర్యానా నుంచి క్షేమంగా సొంత జిల్లాకు చేర్చి కాపాడారు. ప్రస్తుతం ఆమెను ఓ షార్ట్ హోమ్‌లో ఉంచారు.
బాధిత యువతి విషాద గాథ ఆమె మాటల్లోనే..
‘2019 సెప్టెంబర్ 18వ తేదీన హర్యానాకు చెందిన ఒక యువ ఇంజినీర్‌తో వివాహం చేస్తామని కుటుంబసభ్యులు నమ్మించారు. నేను హర్యానా వెళ్లనని తెగేసి చెప్పాను. హర్యానా వెళ్లకపోతే చంపేస్తామని తల్లిదండ్రులు బెదిరించారు. అదేరోజు రాత్రి 1 గంట సమయంలో బలవంతంగా ఓ ఆటోలో ఎక్కించి, నవరంగపూర్‌కు తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం నవరంగపూర్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాస్టర్ ఇంటికి తీసుకువెళ్లారు. అప్పటికే హర్యానా నుంచి వచ్చి ఉన్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, హర్యానా యువకుడు రాజేష్‌తో ఉత్తుత్తి వివాహం చేశారు. రెండు రోజులు పాస్టర్ అత్తగారింటిలో ఉంచి తరువాత 21 వ తేదీ సాయంత్రం నవరంగపూర్‌లోని పంచవటి వనానికి తీసుకువచ్చారు. అదే రోజు సాయంత్రం రాయగడ బస్సులో కూర్చుండబెట్టారు. అమ్మ, అక్క,బావ, తమ్ముడు, పాస్టర్ చిన్న తమ్ముడు, హర్యానా నుంచి వచ్చిన నలుగురు అదే బస్సులో కూర్చున్నారు. బస్సులో నోరు విప్పవద్దని ముందుగానే హెచ్చరించారు. రాయగడ నుంచి మొదట ఢిల్లీ తరువాత హర్యానా తీసుకువెళ్లారు. హర్యానాలో నా కుటుంబ సభ్యులు రెండు రోజులు ఉన్నారు.
నేను ఎంత ఏడ్చినా నా గోడు వినిపించుకోకుండా అక్కడ విడిచిపెట్టి 25 వ తేదీన కుటుంబసభ్యులు నవరంగపూర్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి నాపై శారీరక, మానసిక దాడి ప్రారంభమైంది. ఆ వేధింపులను ఎదిరిస్తే నా కుటుంబానికి ఇచ్చిన మూడు లక్షల రూపాయిలు ఇచ్చి వెళ్లమని బెదిరించారు. డబ్బు ఇచ్చిన విషయం నాకు తెలియదని చెప్పినా లాభం లేకపోయింది. కన్నవారు నన్ను రూ.3 లక్షలకు అమ్మివేసినట్లు అప్పుడు అర్థమైంది. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లమని కన్నవారిని ఎంత అభ్యర్థించినా పట్టించుకోలేదు. అక్కడే ఉండు లేదంటే చావు అని జవాబిచ్చారు. మరో దారిలేక మా బంధువుకు ఫోన్‌లో నా బాధ చెప్పుకున్నాను. నా విషయం కటక్ మెడికల్ కళాశాలలో ఉన్న ఒక మహిళా రోగుల స్పెషలిస్టుకు నేను ఫోన్ చేసిన నా బంధువు ద్వారా తెలిసింది. ఆయన టెలిఫోన్‌లో నవరంగపూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ అజిత్ కుమార్ మిశ్రాకు ఫోన్‌లో వివరించారు. దీంతో నన్ను రక్షిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ వెంటనే పోలీసులకు తెలియ జేశారు. ఈ విషయాన్ని నవరంగపూర్ పోలీసులు వెంటనే హర్యానా పోలీసులకు తెలిపారు. హర్యానా పోలీసులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు నా చిరునామా తెలుసుకుని నన్ను కనిపెట్టారు. నన్ను అక్కడి నుంచి రక్షించి నవరంగ పూర్ తీసుకు వచ్చార’ ని బాధిత యువతి కన్నీటి పర్యంతమైంది.
నాకు న్యాయం చేయాలి
బాధిత యువతని నవరంగపూర్ తీసుకు వచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో జడ్జి ముందు బాధిత యువతిని హాజరు పరచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. తన జీవితంతో ఆటలాడిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బాధిత యువతి డిమాండ్ చేస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment