సాక్షి, హైదరాబాద్:
గాయకుడు గజల్ శ్రీనివాస్ ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతి పరారీలో ఉంది. ఆమెకు నోటీసులు జారీ చేయడానికి పంజాగుట్ట పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు సహకరించిన పార్వతి.. శ్రీనివాస్ చెప్పినట్లుగా వినాలని బాధితురాలిపై ఒత్తిడి తీసుకువచ్చిందని ప్రధాన ఆరోపణ. మంగళవారం ఉదయం పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేయగా.. ఆ రోజు సాయంత్రం వరకు కూడా పార్వతి సేవ్ టెంపుల్స్ సంస్థ కార్యాలయం వద్ద ఉంది. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రిలాంటి వాడని, 20 ఏళ్లుగా తాను అక్కడే పనిచేస్తున్నా ఎలాంటి ఇబ్బందులు రాలేదని మీడియాకు చెప్పింది.
బాధితురాలు ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదనీ పేర్కొంది. కానీ బాధితురాలు చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మంగళవారం సాయంత్రం బయటకు వచ్చాయి. అందులో పార్వతి, గజల్ శ్రీనివాస్‌ల రాసలీలలు స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాతి నుంచి పార్వతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ఆమె సెల్‌ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పార్వతి ఆచూకీ కోసం సేవ్ టెంపుల్స్ కార్యాలయం, ఆమె ఇల్లు, స్నేహితుల వద్ద ఆరా తీస్తున్నారు.
కస్టడీపై నేడు నిర్ణయం
విచారణ నిమిత్తం గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగిశాయి. న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించనుంది. ఇక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన గజల్ శ్రీనివాస్‌పై సేవ్ టెంపుల్స్ సంస్థ వేటు వేసింది. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించినట్లు సంస్థ అధ్యక్షుడు ప్రకాశ్‌రావు వెలగపూడి ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సంస్థ కార్యాలయాలను దేవాలయాలుగా పరిగణిస్తామని, అక్కడ పనిచేసే మహిళల్ని తాము గౌరవంగా చూసుకుంటామని పేర్కొన్నారు.
బాధితురాలి సాహసంపై సోషల్ మీడియాలో ప్రశంసలు
గజల్ శ్రీనివాస్‌కున్న పెద్దమనిషి ముసుగు తొలగించడానికి, ఆయన నిజ స్వరూపం బయటపెట్టడానికి స్టింగ్ ఆపరేషన్ చేసిన బాధితురాలిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతటి సాహసం చేసిన ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. కాగా.. ‘సాక్షి’తో మాట్లాడిన బాధితురాలు.. తనకు ఎదురైన చేదు అనుభవాలు వివరించారు. వెంటనే స్పందించిన పోలీసులు తనకు ఎంతో ధైర్యం ఇచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment