మాట్లాడుతున్న ఎస్పీ జి.పాలరాజు (ఇన్‌సెట్లో) నిందితుడు గంధవరపు గోపి
విజయనగరం టౌన్: బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు గంధవరపు గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ జి. పాలరాజు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక ఆర్మ్‌డ్ పోలీస్ సమావేశ మందిరంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎస్,కోట మండలం బొడ్డవరలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని తోటి స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్‌పై వచ్చి బాలికను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి వాహనం ఎక్కించుకున్నాడని తెలిపారు. ఇంటికి తీసుకెళ్లకుండా సమీపంలో ఉన్న నవోదయ పాఠశాల సమీపంలో గల మామిడి తోటలోకి తీసుకెళ్లి మానభంగం చేసేందుకు ప్రయత్నించగా బాలిక పెద్దగా అరవడంతో నిందితుడు భయపడి పారిపోయాడని చెప్పారు.
దీంతో బాలిక అక్కడ నుంచి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పిందన్నారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.కోట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. సంఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న బొడ్డవర జంక్షన్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా బైక్‌పై వచ్చిన వ్యక్తిని కొంతమంది బాలికలు గుర్తించారని తెలిపారు. వాహనం నంబర్‌ను ట్రేస్ చేసి విచారించగా ఆ వాహనం రెండు రోజుల కిందట జామి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి గురైందన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడు గంట్యాడ మండలం పెంట శ్రీరామపురానికి చెందిన గంధవరపు గోపిగా గుర్తించామని చెప్పారు. వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో గాలించగా నిందితుడు ఎస్.కోట మండలం కొట్యాడ జంక్షన్ వద్ద గురువారం పట్టుబడ్డాడని తెలిపారు.
పలు కేసుల్లో నిందితుడే..
నిందితుడు గంధవరపు గోపిపై ఇప్పటికే గంట్యాడ పోలీస్ స్టేష¯Œన్‌లో రెండు కేసులు, వన్‌టౌన్ పీఎస్‌లో ఒక బైక్ దొంగతనం కేసు, పెందుర్తి పీఎస్‌లో ఒక బైక్ దొంగతనం కేసు, గుర్ల పీఎస్‌లో ఒక చైన్ స్నాచింగ్ కేసు నమోదయ్యాయని ఎస్పీ పాలరాజు తెలిపారు. గోపి కొన్ని రోజుల కిందట విజయవాడ వెళ్లిపోయి నాలుగు రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చాడన్నారు. రెండు రోజుల కిందటే జామి పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనం చేశాడని.. ఆ తర్వాత బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడి పట్టుబడ్డాడని చెప్పారు. నిందితుడ్ని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రవణ్ కుమార్, ఎస్‌కోట సీఐ బి.వెంకటరావు, ఎస్‌కోట ఎస్సై అమ్మినాయుడు, గంట్యాడ పోలీసులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు, డీఎస్పీ సూర్యశ్రావణ్‌కుమార్ ఎస్‌కోట సీఐ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment