
హతమార్చడానికి ముందు గుర్తు తెలియని వ్యక్తిని కట్టేసిన దృశ్యం
ఆదోని/అర్బన్: కిడ్నాపర్‌గా భావించిన ఓ వ్యక్తిని స్థానికులు కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆదోని పట్టణం కిల్చిన్‌పేటలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం మేరకు.. రాత్రి 9 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికను తనతో తీసుకువెళ్లే యత్నం చేశాడు. దీంతో ఆమె తల్లి గట్టిగా అరిచింది. వెంటనే సమీపంలో ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తితో మాట్లాడి వివరాలు సేకరించే యత్నం చేశారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడడంతో బిహార్‌కు చెందిన కిడ్నాప్ ముఠా సభ్యుడని భావించి ప్రజలు రెచ్చిపోయారు.
పోలీసుల నుంచి స్థానికులు ఆ వ్యక్తిని బలవంతంగా అదుపులోకి తీసుకొని మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. రక్షించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు చేసిన యత్నం ఫలించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి.. పోలీసులు చూస్తుండగానే ఆ వ్యక్తి రక్తపు మడుగులో పడి ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ అంకినీడు ప్రసాద్, త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, వన్ టౌన్ ఎస్‌ఐ నాగేంద్ర సిబ్బందితో ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. గుమిగూడిన వారిని చెదరగొట్టారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని, గుర్తుతెలియని వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారు తారసపడినా తమకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. అనుమానంతో వ్యక్తులను కొట్టి చంపడం మంచిది కాదని అన్నారు. ఘటనపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment