రంగనాయక సాగర్ వద్ద ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు
చిన్నకోడూరు(సిద్దిపేట) : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే పరమేశ్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు సోమవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనుల వద్ద ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర పరమేశ్(27) కూలి. ఈనెల 10వ తేదీ రాత్రి పనులు ముగించుకుని బైక్‌పై గంగాపూర్‌కు వెళ్తుండగా చంద్లాపూర్ శివారులో కల్వర్టు నిర్మాణ పనులు జరిగే చోట రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న గుంతలో పడ్డాడు.
తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణ పనుల్లో జాప్యం చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుడి బంధువులు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులు జరిగే వద్ద ఆందోళనకు దిగారు. ఏడాది పాటు గుంత తీసి.. నెమ్మదిగా పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. పనులు వేగంగా జరిగి ఉంటే పరమేశ్ ప్రమాదానికి గురయ్యేవాడు కాదని చెప్పారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగిన ఈ ప్రమాదం మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు ఎస్సై అశోక్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినా ఫలితం లేదు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తామని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment