కేజీఎఫ్ : దేవుడి పేరు చెప్పి సమస్యలను పరిష్కరిస్తానని నమ్మించి ఓ మంత్రగాడు మహిళ నుంచి సుమారు 27 కోట్ల విలువ చేసే సైట్లు, ఇతర ఆస్తి పాస్తులను బంగారు ఆభరణాలను తస్కరించుకుని వెళ్లిన ఘటన కోలారు జిల్లా బంగారుపేట పట్టణంలో జరిగింది. పట్టణంలోని శ్రీ నగర కాలనీలోని సొల్లాపురమ్మ దేవాలయ సంస్థాపకుడు, పూజారి నాగరాజ్ అనే వ్యక్తి మహిళను మోసగించాడు. పూజల నెపంతో మహిళను వంచించి నగలు, నగదుతో పరారయ్యాడు. కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానని తనకు సొల్లాపురమ్మ దేవి పూనుతుందని నమ్మించాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి, బంగారు ఆభరణాలతో పరారయ్యాడు.
కాగా మోసపోయిన మహిళ గతంలో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి బెంగుళూరు బీటీఎం లేఅవుట్‌లో నివాసం ఉంటోంది. 2019లో భర్త మరణించాడు. అనంతరం మోసపోయిన మహిళ భర్త రెండో భార్య కుమారుడు రాజేష్ తనకు ఆస్తిలో భాగం కావాలని కోర్టుకు వెళ్లాడు. దీంతో విసిగిన మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి బెంగుళూరు రామమూర్తి నగర్‌లో అద్దె ఇంటిలో ఉంటోంది. మహిళ తన కష్టాన్ని బేతమంగలకు చెందిన మునియమ్మతో చెప్పుకుంది. మునియమ్మ తనకు ఓ మాంత్రికుడు పరిచయం ఉన్నాడని అతడు అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని తెలిపింది. బంగారుపేటలోని సొల్లాపురమ్మ దేవాలయ పూజారి నాగరాజ్‌ను పరిచయం చేసింది.
నాగరాజ్ ప్రతి శుక్రవారం, మంగళవారం తన దేవాలయానికి వచ్చి పూజలు చేయాలని తనకు ప్రతి శుక్ర, మంగళవారాలలో దేవి ఆవహించి కోరికలు తీరుస్తుంది. దేవి చెప్పినట్లుగా నడచుకోవాలని లేని పక్షంలో కీడు కలుగుతుందని భయపెట్టాడు. పూజారి నాగరాజ్ చెప్పినట్లుగానే మహిళ ప్రతి శుక్ర, మంగళవారాలు దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించేది. ఓ రోజు నాగరాజ్ దేవి ఆవహించిందని నాటకం ఆడి ఆస్తి విషయానికి సంబంధించి ముగ్గురు కుమారులకు గండం ఉందని ఒక్కో కుమారుడి పేరుతో తలా మూడు బంగారు బిస్కెట్‌లు దానం చేయాలని తెలిపాడు. అతను చెప్పినట్లుగా మహిళ తన వద్ద బంగారాన్ని కరిగించి కిలో తూకం కలిగిన మూడు బంగారం బిస్కెట్‌లను సమర్పించుకుంది.
మరో వారం తన వద్దకు వచ్చిన మహిళతో భూమి, స్థిరాస్తి ఉందని దానిని సూచించిన వారికి విక్రయించి ఆ డబ్బును తనకిస్తే దానిని రెండింతలు చేసి ఇస్తానని నమ్మించాడు. అతను చెప్పినట్లుగా మహిళ బెంగుళూరులోని తన 10కి పైగా సైట్‌లను విక్రయించి వచ్చిన డబ్బును తీసుకు వచ్చి మంత్రగాడి చేతిలో పెట్టింది. డబ్బు బంగారం చేతికి రాగానే నాగరాజ్ అక్కడి నుంచి ఉడాయించాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ బెంగుళూరు రామమూర్తి నగర్ పోలీస్ట్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడానికి బంగారుపేటకు రాగా మాయగాడు అక్కడి నుంచి మాయమయ్యాడు. పూ జారి భార్య లక్ష్మమ్మ, బావమరిది పెరు మాళ్, సహచరుడు దేవరాజ్, హోసూరు మంజు, సాయి కృష్ణ అనే వ్యక్తులపై కూడా మౌఢ్యాచార నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment