సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మసీ విద్యార్థి సోనీ లో కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నల్లమల ఫారెస్ట్ ఏరియాలో కిడ్నాపర్ రవిశంకర్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆంధ్ర పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు కిడ్నాప్ వ్యవహారంలోనూ కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం. ఆ ఆధారాల ప్రకారం సోని కిడ్నాప్‌లో బంధువుల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ రవిశంకర్‌ను పట్టుకునేందుకు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ చుట్టూ తిరుగుతున్న దర్యాప్తు
నగరంలో జరిగిన ఫార్మసీ విద్యార్థి సోనీ కిడ్నాప్ స్టోరీ ఇప్పుడు ఏపీ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో కిడ్నాపర్ ఆనవాళ్లను పోలీసులు పసిగట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో బృందాలుగా విడిపోయి ఆంధ్రా- తమిళనాడు, ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు . హైదరాబాద్‌లో కిడ్నాప్ అయిన ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ ఇంకా తెలియలేదు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో తండ్రిని నమ్మించి కూతురు సోనీని తీసుకువెళ్లిన కిడ్నాపర్ రవిశంకర్ ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన వాడుగా గుర్తించారు.
ఈజీ మనీకి అలవాటుపడ్డ రవిశంకర్ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దృష్టి మళ్లించి పనికానిచ్చేయటంలో దిట్ట. కంకిపాడు, పెనమలూరు, విజయవాడల్లో పలు దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. అలా జైలు నుంచి విడుదలై బయటకు రాగానే మళ్లీ దొంగతనాలు చేస్తూ కాలం గడిపేవాడు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఒక్క ఏపీలోనే 25 నేరాలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
ఓ కేసులో అరెస్టయిన రవిశంకర్ ఎస్కార్ట్ కళ్లుగప్పి ఏపీ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి హైదరాబాద్‌లో ప్రత్యక్షమై ఫార్మసీ విద్యార్థి సోనీని కిడ్నాప్ చేశాడు. దీంతో రవిశంకర్ స్వగ్రామం కృష్ణా జిల్లా దావులూరు కావడంతో.. ఆమెని ఏపీలో దాచి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకుని కేసును చేధించాలని తెలంగాణ పోలీసులు చూస్తున్నారు. ఇప్పటివరకు కేవలం దొంగతనాలు మాత్రమే చేసిన రవిశంకర్ ఇప్పుడు కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు? పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత ఏదైనా గ్యాంగ్‌తో చేతులు కలిపాడా? కిడ్నీ రాకెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? దుబాయికి అమ్మాయిలని అమ్మే ముఠాలో సభ్యుడయ్యాడా? ఇందుకోసమే తండ్రిని ట్రాప్ చేసి కూతురు సోనిని కిడ్నాప్ చేశాడా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవిశంకర్ కుటుంబ సభ్యులు మాత్రం అతడి నేర ప్రవృత్తితో విసుగెత్తిపోయారు. రవిశంకర్ తీరుతో తాము అవమానాలు ఎదుర్కోవలసి వస్తోందని వాపోతున్నారు. రవిశంకర్‌ను పట్టుకుని శిక్షించాలంటున్నారు. రవిశంకర్ పై స్వగ్రామం దావులూరు వాసులు మండిపడుతున్నారు. సోనీని విడిచి పెట్టి పోలీసులకు లొంగిపోవాలని సూచిస్తున్నారు. కొడుకు పడుతున్న బాధలను చూసిఅయినా రవిశంకర్ మారాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment