పోలీసులకు పట్టుబడిన బెంగాలీ దంపతులు
బనశంకరి : డేటింగ్ వెబ్‌సైట్ ద్వారా యువకులను వంచనకు పాల్పడుతున్న బెంగాలీ దంపతులను మంగళవారం సీఐడీ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.44 వేల నగదు, బ్యాంకుల చెక్కుబుక్స్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పీ సచిన్ పీ.ఘోర్పడే తెలిపారు. వివరాలు... కోల్‌కత్తాకు చెందిన బెంగాలీ చెందిన కుశన్ మంజుదార్, అతని భార్య రుపాళీ మంజుందార్, కుశన్ బెంగాలీ బుల్లితెర నటుడు. ఇదిలా ఉంటే బెంగళూరు నగరానికి చెందిన 34 ఏళ్ల టెక్కీ డేటింగ్ వెబ్‌సైట్ మింగల్ 2లో వివరాలను అప్‌లోడ్ చేశాడు. దీనిని గమనించిన రూపాళీ, కోల్‌కత్తా అర్పితా పేరుతో టెక్కీని పరిచయం చేసుకుంది. మొబైల్, వాట్సాప్‌లో గుడ్‌మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజ్‌తో పాటు వ్యక్తిగత పోటోలు పంపుతూ స్నేహం పెంచుకుంది. 2017 జూలై నెలలో తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని అత్యవసర కిత్సకోసం రూ.30 వేల నగదు కావాలని టెక్కీని కోరింది. దీంతో టెక్కీ అర్పిత ఖాతాకు రూ. 30 వేలు నగదు జమ చేశాడు.
త్వరలోనే బెంగళూరు వస్తానని, వచ్చినప్పుడు నగదు చెల్లిస్తానని సమాచారం ఇచ్చింది. మరికొద్దిరోజుల్లో అర్పిత తన తండ్రికి గుండెపోటు వచ్చిందని, కోల్‌కత్తా బీఎం బిర్లా హార్ట్‌రీసెర్చ్ సెంటర్‌లో చేర్చామని ఆర్థిక సహాయం చేయాలని టెక్కీని మరోసారి కోరింది. ఇదేవిధంగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి గత జనవరి వరకు టెక్కీ నుంచి రూ.59.72 లక్షల నగదు అర్పిత అకౌంట్‌కు జమ చేయించుకుంది. అనంతరం ఆమె నడవడిక పట్ల అనుమానించిన టెక్కీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్ నెంబర్, బ్యాంక్‌ఖాతా, నగదు డ్రాచేసుకున్న బ్యాంక్ వివరాలు, సీసీ కెమెరా వీడియోను పరిశీలించగా వంచకుల ఆచూకీ తెలిసింది. అనంతరం సీఐడీ ప్రత్యేక బృందంం కోల్‌కత్తా వెళ్లి బెంగాలీ దంపతులు కుశన్‌ముజుందార్, రూపాలిముజుందార్‌ను మంగళవారం అరెస్ట్ చేసి బుధవారం నగరానికి తీసుకువచ్చారు.
విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి
రూపాళీ భర్త కుశన్ ముజుందార్ బుల్లి తెరనటుడు. ఈయన పలు బెంగాలీ సీరియల్స్‌లో నటించాడు. భార్య రూపాళీ మాయలో పడుతున్న వ్యక్తులతో వాట్సాప్, ఇమెయిల్ చాటింగ్ చేస్తూ వంచనకు మద్దతు పలుకుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. వంచనకు పాల్పడిన నగదులో రూపాళీ విలాసవంతమైన జీవనం సాగించేది. డేటింగ్‌వెబ్‌సైట్‌లో మింగల్ 2లో రూపాళీ ముజుందార్ పేరు నమోదు చేసుకుని తన మోడల్‌ఫొటోలు ఆప్‌లోడ్ చేసేది. లైక్‌చేసిన వ్యక్తులతో తాను డాక్టర్, ఉపాధ్యాయురాలిగా పరిచయం చేసుకుని స్వీట్‌గా మాట్లాడి మాయలోకి దింపి వివిధ మార్గాల్లో వంచనకు పాల్పడి రూ. లక్షలు వసూలు చేసేది. గత 9 ఏళ్లు నుంచి ఎలాంటి ఉద్యోగం చేయకుండా అమాయకులను వంచనకు పాల్పడి వారి వద్ద నుంచి ఆన్‌లైన్‌లో తన బ్యాంక్ అకౌంట్ ఖాతా నగదు జమచేసుకునేది. అనంతరం దంపతులు ఇద్దరూ విలాసవంతమైన జీవనం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment