నిర్వాహకుడి నిర్లక్ష్యమే కారణం | Police Arrest Paragliding Management in Kullu Manali | Sakshi
Sakshi News home page

నిర్వాహకుడి నిర్లక్ష్యమే కారణం

Published Wed, Aug 14 2019 12:59 PM | Last Updated on Wed, Aug 14 2019 12:59 PM

Police Arrest Paragliding Management in Kullu Manali - Sakshi

చంద్రశేఖర్‌రెడ్డి (పైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమానాలిలో పారాచూట్‌ తెరుచుకోకపోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయిన నగరానికి చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ఉదంతంలో నిర్వాహకుడిని నిర్లక్ష్యం ఉన్నట్లు మనాలీ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే  పారాగ్లైడింగ్‌ నిర్వాహకుడు బుధీ సింగ్‌ను సోమవారం అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీలోని సెక్షన్‌ 304 కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌ 15 వరకు కులుమనాలీ ప్రాంతాల్లో పారాగ్లైడింగ్, రివర్‌ ర్యాఫ్టింగ్స్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించిన కులు పోలీసులు ఉల్లంఘించిన నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తపేట డివిజన్, సమతాపురి కాలనీకి చెందిన వేమారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి (24) ఈసీఐఎల్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్‌గా విధులు నిర్వహించేవారు.గత బుధవారం అతను సమతాపురి కాలనీకి చెందిన తన స్నేహితులు విశాల్, అఖిల్‌తో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలికి విహారయాత్రకు బయలుదేరి వెళ్లాడు.

శనివారం అక్కడి మంఝా గ్రామంలో పారాగ్లైడింగ్‌ చేయాలని భావించిన అతను ఈ తరహా సంస్థను నిర్వహించే షనాగ్‌ గ్రామానికి చెందిన బుధీసింగ్‌ను సంప్రదించాడు. అయితే మాన్‌సూన్‌ సీజన్‌లో పారాగ్లైడింగ్‌ నిషేధం ఉంటుందన్న విషయం తెలిసినప్పటికీ బు«ధీసింగ్‌ ఈ విషయాన్ని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పలేదు. యాత్రికులను పారాగ్లైడింగ్‌ తీసుకువెళ్లడానికి తన వద్ద ఉత్తరప్రదేశ్‌కు చెందిన జోగీందర్‌ను పైలెట్‌గా నియమించుకున్నాడు. తక్కువ జీతం ఇవ్వవచ్చనే ఉద్దేశంతో సుశిక్షుతుడు కాకపోయినా జోగీందర్‌తోనే పారాగ్లైడింగ్‌ చేయిస్తున్నాడు. శనివారం ఇతడితో కలిసే పారాగ్‌లైడింగ్‌కు వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాదం జరగడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో జోగీందర్‌ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే చంద్రశేఖర్‌ మృతదేహం నగరానికి చేరుకోవడంతో పాటు అంత్యక్రియలు పూర్తయ్యాయి.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కులు పోలీసులు నిర్వాహకుడి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో బుధీసింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సెప్టెంబర్‌ 15 లోగా ఎవరైనా కులుమనాలీల్లో పారాగ్లైడింగ్‌æ, రివర్‌ ర్యాఫ్టింగ్‌ నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కులు ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ విషయం పర్యాటకులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement