స్మగ్లర్లతో మాట్లాడుతున్న ఐజీ కాంతారావు
అటవీ శాఖలో వాచర్లుగా పనిచేసిన ఆ యువకులు స్మగ్లర్లుగా అవతారమెత్తారు. నాటు తుపాకులతో శేషాచలంలో తిరుగుతూ ఎర్ర చందనం చెట్లను నరికే తమిళ స్మగ్లర్లను బెదిరించి వారి దగ్గరున్న ఎర్ర దుంగలను దోచుకెళ్లే హైజాకింగ్ ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా వీరి పని బాగానే ఉంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో ఆర్థికంగానూ ఎదిగారు. మరి కొం తమంది యువకులను చేరదీసి స్మగ్లింగ్ వైపు మళ్లించారు. జల్సాలకు డబ్బులిస్తూ, యువకుల అవసరాలను తీరుస్తూ హైజాకింగ్‌లో ఎదిగారు. ఆరు నెలలుగా దృష్టి పెట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులకు హైజాకింగ్ ముఠా పెద్ద సవాల్‌గా మారింది. ఎన్నిసార్లు వలపన్నినా తప్పించుకు పారిపోతున్నారు. అయితే ఈసారి టాస్క్‌ఫోర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. హైజాకింగ్ ముఠాలోని ఐదుగురు స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ ఉచ్చులో పడ్డారు. నింది తులు చెప్పిన వివరాలు విని టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులే విస్మయానికి గురయ్యారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి నుంచి ఆర్‌ఎస్‌ఐ వాసు బృందం కల్యాణి డ్యాం మీద నుంచి పులిబోను మీదుగా కూంబింగ్ జరుపుతోంది. సోమవారం ఉదయం అటవీ మార్గంలో కొందరు స్మగ్లర్ల కదలికలు గుర్తించారు. వారికి కనిపించకుండా వెంట పడ్డ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సరిగ్గా పులిబోను దగ్గర ఐదుగురు స్మగ్లర్లను ఏకకాలంలో చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టారు. దీంతో స్మగ్లర్ల కాళ్లకు బ్రేకులు పడ్డాయి. ఐదుగురు నిందితులనూ అదుపులోకి విచారించారు. గతంలో అటవీ శాఖలో ప్రొటెక్షన్ వాచర్లుగా పనిచేసిన కొంత మంది యువకులు ఇప్పుడు స్మగ్లర్లుగా మారారు. రంగంపేటకు చెందిన సురేశ్ వీరికి నాయకత్వం వహిస్తున్నాడు. నాటు తుపాకులను సంపాదించిన సురేశ్ కొంత మంది చురుకైన యువకుల్ని ఎంపిక చేసుకుని హైజాకింగ్ ముఠాను తయారు చేశాడు. ఎర్ర దుంగలు తరలించే తమిళ స్మగ్లర్ల కదలికల్ని ముందే గుర్తించి వారిపై దాడి చేసి వారివద్దనున్న దుంగలను దోచుకోవడం ఈ ముఠా పని.
గతంలో ప్రొటెక్షన్ వాచర్లుగా పనిచేసి యువకులకు అడవిలో తిరగడం, స్మగ్లర్ల కదలికల్ని గుర్తించడం సులభం. వాచర్లుగా పనిచేసిన అనుభవాన్ని స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించుకుంటూ సురేశ్ ముఠా పోలీస్‌లకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం ఐదుగురు ముఠా సభ్యుల్ని పట్టుకున్న పోలీసులకు కర్ణాటక రాష్ట్రానికి దుంగలు తరలించేందుకు అడవిలో తిరుగుతున్న సురేశ్ కదలికలు కూడా తెలిశాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల వ్యూహాన్ని ముందే పసిగట్టిన సురేశ్ కారుతో సహా పరారయ్యాడు. టాస్క్‌పోర్సు ఫోలీసులు వెంటనే చిత్తూరు, పలమనేరు, గంగవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసిన విషయాన్ని తెల్సుకుని ఐజీ కాంతారావు, డీఎస్పీ హరినాథబాబు, ఆర్‌ఐ చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలికి చేరుకుని ఆర్‌ఎస్‌ఐ వాసు బృందాన్ని అభినందించారు.
పట్టుబడ్డ స్మగ్లర్లు వీరే..
రంగంపేట కేంద్రంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న హైజాకింగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎన్. నాగరాజు, ఎం. చంద్రయ్య, కే. శ్రీనివాసులు సి. ప్రతాప్‌రెడ్డి, వై. ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. మొదటి ఇద్దరిపైనా 2016, 2015ల్లో నాగపట్ల, రంగంపేట పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. పారిపోయిన సురేశ్‌పై మాత్రం చాలా కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment