లక్నో: గర్భవతి అయిన భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఆమె శరీరాన్ని ముక్కలు చేసి... పిండి మరలో వేసి.. ఆఖరికి తగులబెట్టాడు. ఈ ఘాతుకాన్ని అతడి పెద్ద కూతురు బయటపెట్టడంతో చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... రాయ్‌బరేలికి చెందిన రవీంద్ర(35)కు 2011లో ఊర్మిళ(27) అనే మహిళతో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు(11, 7 సంవత్సరాల వయస్సు) ఉన్నారు. అయితే రవీంద్రకు మాత్రం కొడుకును కనాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో ఊర్మిళ మరోసారి గర్భం దాల్చింది. దీంతో మళ్లీ ఆమెకు ఆడపిల్లే పుడుతుందనే అనుమానంతో రవీంద్ర.. తనను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి, సోదరుల సహాయంతో జనవరి 4న ఊర్మిళను దారుణంగా హత్య చేశాడు.
గొంతు నులిమి.. ఆపై
తన పథకంలో భాగంగా... తొలుత ఊర్మిళ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పదునైన ఆయుధంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వాటన్నింటినీ పిండి మరలో వేసి గ్రైండ్ చేశాడు. మిగిలిన శరీర భాగాలను కాల్చి వేసి.. ఆ బూడిదను, పాక్షికంగా కాలిన భాగాలను ఓ సంచిలో మూటగట్టి తన ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పొదల్లో పడేశాడు. అనంతరం తనకేమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. అయితే ఊర్మిళ కనిపించకపోవడంతో ఆమె పుట్టింటి వారికి రవీంద్ర మీద అనుమానం కలిగింది.
ఈ క్రమంలో ఊర్మిళ పెద్ద కూతురు(11) తన తాతయ్య(ఊర్మిళ తండ్రి)కు జరిగిన విషయం మొత్తం చెప్పి.. అమ్మను చంపేశారంటూ ఏడవడం మొదలుపెట్టింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఊర్మిళ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రవీంద్రను తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. కొడుకు పుడతాడో లేదో అన్న అనుమానంతో తానే భార్యను హత్య చేశానంటూ పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. ఇక ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న రవీంద్ర తండ్రి, సోదరుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment