
సాక్షి, అనంతపురం : మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బుల బ్యాగును దోచుకెళ్లిన దొంగకు ప్రజలు చుక్కలు చూపించారు. దొంగతనం జరిగిన కొన్ని గంటలకే అతన్ని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ ఉదయం యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన నాగలక్ష్మమ్మ అనే పంచాయతీ కార్యదర్శి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు 16 లక్షల రూపాయల నగదును బ్యాంకునుంచి డ్రా చేసింది. వాటిని బ్యాగులో ఉంచి ఆటోలో తీసుకెళుతుండగా కుళ్లాయప్ప అనే దొంగ ఆమెను బెదిరించి డబ్బుల బ్యాగును లాక్కెళ్లిపోయాడు.
ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. అక్కడి గ్రామాల పెద్దలకు సమాచారం ఇవ్వటంతో పాటు గాలింపు చేపట్టారు. దాదాపు వెయ్యిమంది ప్రజలు దొంగను పట్టుకోవటానికి రంగంలోకి దిగారు. దొంగని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడి వద్దనుంచి డబ్బును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment