నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో జరిగిన వరుస అత్యాచారాలు, హత్యల కేసులకు సంబంధించి పోలీసుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. రెండ్రోజులుగా నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి ముందు పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.చంద్రశేఖర్ ఓరల్ వాదనలు వినిపించారు. మూడు హత్యలకు సంబంధించి తొలి రోజు ఒక ఘటనకు సంబంధించి, రెండో రోజు మరో రెండు హత్యలకు సంబంధించి వాదనలు వినిపించారు. ఇద్దరు బాలికల హత్యలకు సంబంధించి వాదనలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి.
ఘటనకు సంబంధించి అన్ని రకాల ఆధారాలతోపాటు నిందితుడు తానే నేరం చేసినట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్న సాక్షులను కూడా కోర్టు ముందు ఉంచారు. దీంతో నిందితుడు శ్రీనివాస్ రెడ్డే హత్యలు, అత్యాచారాలు చేశాడని పీపీ చంద్రశేఖర్ వాదించారు. ఇలాంటి వారు సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు. క్రూరంగా అత్యాచారం, హత్య చేసిన నిందితుడు ఉరిశిక్షకు అర్హుడన్నారు. అనంతరం భువనగిరి యాదాద్రి జిల్లా ఏసీపీ భుజంగరావు నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను వివరిస్తూ తన వాదన వినిపించారు. దీంతో పోలీసుల తరఫు ఓరల్ వాదనలు పూర్తయ్యాయి. రాతపూర్వక వాదనల కోసం ఫైల్ దాఖలు చేయనున్నట్లు పీపీ చంద్రశేఖర్ తెలిపారు.
నేడు నిందితుడి తరఫు ఓరల్ వాదనలు..
హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తరఫున లీగల్ సెల్ నియమించిన న్యాయవాది ఠాగూర్ వాదనలు బుధవారం వినిపించనున్నారు. మూడు హత్యా కేసులకు సంబంధించి ఈ వాదనలు వినిపిస్తారు. మరోవైపు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలంటూ మహిళా న్యాయవాదులు కోర్టు ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment