
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
తూప్రాన్/రాయపోలు(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తూప్రాన్ పట్టణ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ–2 ఎల్లగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ పట్టణంలో నివాసం ఉంటున్న సీహెచ్ మల్లయ్య(38) అనే కానిస్టేబుల్ సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంతో బాధపడుతున్నాడు. ఇద్దరు కుమారుల చదువులు, ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో తీసుకున్న రుణానికి వాయిదాలు, తదితర కారణాలతో నిత్యం బాధ పడుతుండేవాడన్నారు. అయితే గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో 15 రోజుల పాటు డ్యూటీకి వెళ్లలేదు.
దీంతో పోలీస్ ఉన్నతాధికారులు గత నాలుగు నెలల నుంచి జీతం ఇవ్వడంలేదు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు ఏదురయ్యాయి. మానసికంగా కుంగిపోయాడు. ఈ నెల 16న డ్యూటీ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడన్నారు. అప్పటి నుంచి తనలో తానే బాధపడుతూ మాససికంగా మదనపడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. అయితే బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించిన మల్లయ్య తెల్లవారేసరిగా బెడ్‌రూంలోని కిటికీ ఊచలకు తన లుంగీతో ఊరివేసుకుని మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య అనూష, ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్‌లు ఉన్నారు. కాగ ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక సీఐ లింగేశ్వర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరమార్శించి ఓదార్చారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్డం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment