బైక్‌ రేసర్లపై కొరడా | Police Counselling To Visakhapatnam Bike Racers | Sakshi

బైక్‌ రేసర్లపై కొరడా

Aug 6 2018 1:07 PM | Updated on Aug 8 2018 1:14 PM

Police Counselling To Visakhapatnam Bike Racers - Sakshi

స్పెషల్‌ డ్రైవ్‌లో సీజ్‌ చేసిన ద్విచక్రవాహనాలు

విశాఖ క్రైం: నగర పరిధిలోని బీచ్‌రోడ్‌లో బైక్‌ రేసర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా ఆదేశాల మేరకు శనివారం రాత్రి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. భీమిలి, ఎంవీపీ, పీఎంపాలెం, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఆరిలోవ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో తనిఖీ నిర్వహించి 100 బైక్‌లను సీజ్‌ చేశారు. ఇందులో 13 బైక్‌లను మైనర్లు నడిపినట్టు గుర్తించారు. కొంత మంది మైనర్లు బైక్‌లు వదిలి వెళ్లిపోయారు. పోలీస్‌ బ్యారెక్స్‌లో ఆదివారం సీజ్‌ చేసిన బైక్‌లను ప్రదర్శనలో పెట్టి , రేసులో పాల్గొన్న యువకులు, విద్యార్థులు, వారి  తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ పకీరప్ప మాట్లాడారు.

ఎవరైనా ద్విచక్ర వాహనాలను అతివేగంగా, సైలెన్సర్లు తీసి అధిక శబ్ధంతో నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల పై విన్యాసాలు చేయడం, రేసింగ్‌లు పూర్తిగా నిషేధమన్నారు. ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబం ధనలను ఉల్లంఘించి నడిపిన 100 బైక్‌లను సీజ్‌ చేశామని, వాహనచోదకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్స్‌ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ రెండో సారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, స్పీడ్‌ గన్ల ద్వారా బైక్‌రేసర్లను గుర్తిస్తామన్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా బైక్‌ రేసర్ల సమాచారం వచ్చిందని, నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టుబడిన వారిలో ఇంటర్మీడియెట్‌ విద్యార్థి ఉన్నాడని, అతనిపై రెండు క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు గుర్తించామన్నారు. వాహనాలు తల్లిదండ్రుల పేరు మీద ఉంటే.. వారికి జరిమానా విధిస్తామన్నారు. సీజ్‌ చేసిన బైక్‌లను డంపింగ్‌ యార్డుకు పంపిస్తున్నట్లు తెలిపారు. నగరంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో 508, మెట్రిక్‌ సంస్థ ద్వారా 1,648 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ట్రాఫిక్‌ ఏసీపీ కింజరాపు ప్రభాకర్, నాగేశ్వరరావు, సీఐలు శ్రీనివాస్, ఈశ్వరరావు, లక్ష్మణమూర్తి, సింహచలం, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement