జనం లేరా..? వెయిట్‌ చేయండి.. | - | Sakshi
Sakshi News home page

జనం లేరా..? వెయిట్‌ చేయండి..

Aug 16 2023 1:08 AM | Updated on Aug 16 2023 10:55 AM

ప్రతిజ్ఞ చేస్తున్న టీడీపీ కార్యకర్తలు - Sakshi

ప్రతిజ్ఞ చేస్తున్న టీడీపీ కార్యకర్తలు

సాక్షి, విశాఖపట్నం: ‘ఏందయ్యా ఇది.. ముందే చెప్పాను కదా.. అయినా జనాల్ని తీసుకురాలేకపోయారా.? త్వరగా బీచ్‌ రోడ్‌ నింపండి. అప్పుడే చెప్పండి.. బయటికి వస్తాను...‘ పార్టీ నాయకులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గరం గరమయ్యారు. ఇండియా విజన్‌–2047 కార్యక్రమం పేరుతో మరో మోసపూరిత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ చేరుకున్నారు.

సాయంత్రం 4 గంటలకు బీచ్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి పాదయాత్రగా ప్రారంభం కావాలి. కానీ.. నోవాటెల్‌ లో బసచేసిన చంద్రబాబు.. అక్కడకి జనం రాలేదని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల్ని పిలిచి.. జన సమీకరణకు ఇంకా ఎంతసేపు టైం కావాలని అసహనం వ్యక్తం చేశారు. జనం నిండిన తర్వాతే వస్తానని చెప్పడంతో నేతలు హడావుడిగా పార్టీ శ్రేణులతో రోడ్డు నింపారు. అనంతరం తాపీగా బయటికి వచ్చిన బాబు.. గంటన్నర ఆలస్యంగా పాదయాత్ర మొదలు పెట్టారు.

సందర్శకులకు ఇబ్బందులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సందర్శకులు భారీగా బీచ్‌కు వచ్చారు. అయితే.. చంద్రబాబు కార్యక్రమం కారణంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 తర్వాత యథావిధిగా రాకపోకలు సాగిస్తామని పోలీసులు పర్యాటకులకు సర్ధి చెప్పారు. కానీ చంద్రబాబు ఆలస్యంగా మొదలు పెట్టడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెలవు రోజున ఇలా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలేంటంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లా.. ఫొటోలకు ఎరేంజ్‌ చెయ్‌...
పాదయాత్రగా వెళ్తున్న బాబుతో ఫొటోలు దిగేందుకు స్థానికులెవ్వరూ రాకపోవడంతో ఆయన విస్తుపోయారు. వెంటనే స్థానిక నేత పల్లా శ్రీనివాసరావుని పిలిపించి.. పాదయాత్ర చప్పగా సాగుతోందనీ.. విభిన్న వర్గాల వారు వచ్చి ఫొటోలు తీసుకునేలా ఎరేంజ్‌ చేయాలని హుకుం జారీ చేశారు. వెంటనే పల్లాతో పాటు ఇతర నాయకులు అదే పనిలో నిమగ్నమయ్యారు. ఒక లాయర్‌, ముస్లిం మహిళ, స్టూడెంట్‌.. ఇలా ఒక్కొక్కర్ని పిలిపించి చంద్రబాబుతో ఫొటోలు దిగేలా చేసి.. పక్కకు తోసేశారు.

మరో మోసపూరిత డాక్యుమెంటా.?
ప్రతిసారీ విజనరీ పేరుతో హడావుడి చేసే చంద్రబాబు.. ఈ ఎన్నికల ముందు కూడా అదే పల్లవి అందుకున్నారు. గతంలో విజన్‌–2020 పేరుతో జనాల్ని మభ్యపెట్టిన బాబు.. ఇప్పుడు విజన్‌–2047 పేరుతో డాక్యుమెంట్‌ విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన బాబు... తన వద్ద సలహాదారులుగా వ్యవహరించిన వారితో కలిసి.. బాబు చైర్మన్‌గా గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టైనబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(జీఎఫ్‌ఎస్‌టీ) పేరుతో సంస్థ ప్రారంభించారు. సదరు సంస్థ రూపొందించిన డాక్యుమెంటే ఇది. ఈ కార్యక్రమానికి వచ్చిన కొందరు విద్యావేత్తలు, నాయకులు చంద్రబాబు హడావుడి చూసి నవ్వుకున్నారు.

కొందరైతే.. 2020 అయిపోయింది.. ఇప్పుడు 2047 పేరుతో హడావుడా అంటూ గుసగుసలాడుకున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏపీని అభివృద్ధి చేయలేకపోయారు కానీ.. ఇప్పుడు ఇండియా విజన్‌ అని చెప్పడం విడ్డూరమంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా.. డాక్యుమెంట్‌పై సలహాలు, సందేహాలు అడిగేందుకు టీడీపీ నేతలే ప్రత్యేకంగా కొందర్ని ఎంపిక చేసుకున్నారు. వారికి ఏ ప్రశ్నలడగాలో ముందుగానే స్క్రిప్ట్‌ ఇచ్చేశారు. ప్రజలకు అనుమానం రాకుండా ప్రశ్నలడిగేవారిని అక్కడక్కడా కూర్చోబెట్టడం కొసమెరుపు. చంద్రబాబు తన ప్రసంగం ఆద్యంతం చర్వితచరణంగానే సాగింది. సమైక్యాంధ్రగా ఉన్నప్పుడే విశాఖని ఆర్థిక నగరంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. హుద్‌ హుద్‌ గురించి చెబుతున్నప్పుడు జనం కూడా ఎన్నిసార్లు ఇది చెబుతారంటూ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement