బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): భారీ యుద్ధ నౌకలు... స్పీడు బోట్లు.. ఫైటర్ జెట్స్... యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ తీరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. మిలాన్–2024లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో మంగళవారం నిర్వహించిన ఫైనల్ రిహార్సల్స్ అద్భుతంగా సాగాయి. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు తీరంలో తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించటం, తీవ్రవాదుల దాడులను ఎదుర్కొవడం వంటి అంశాలను ప్రదర్శించారు.
అనంతరం మిగ్, హక్స్, ఫైటర్ జెట్స్ తీరంలో బాంబులను వెదజల్లుతూ అబ్బురపరిచాయి. అదే సమయంలో ఆకాశం నుంచి ఆరుగురు సైనికులు జాతీయ పతాకం, నేవీ పతాకం పట్టుకుని పారాచూట్ ద్వారా కిందికి దిగారు. వారు ఒక బహుమతిని ముఖ్య అతిథికి అందజేశారు. నేవీ స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన, జాతీయ గీతాల ప్రదర్శనలు అలరించాయి. అనంతరం దేశ రక్షణ బలగాలు, రాష్ట్ర రక్షణ బలగాలు, విదేశీ నేవీ బలగాలు, రాష్ట్ర సంప్రదాయ కూచిపూడి, థింసా, కోయ నృత్యాలు, సంక్షేమ పథకాల నమూనాలతో భారీ పరేడ్ నిర్వహించారు.
ఈ నెల 22వ తేదీన తుది పరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, పరేడ్ ఫైనల్ రిహార్సల్స్ చూసేందుకు విశాఖ నగర వాసులు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకున్నారు. ఆర్కే బీచ్ నుంచి కురుసుర మ్యూజియం వరకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఈ రిహార్సల్స్‌ను చూసేందుకు నేవీ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment