వీరఘట్టం: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగితే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు సరైన సమయానికి స్పందించి బాధితులను ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన వైనమిది... గరుగుబిల్లి మండలం చిలకాం జంక్షన్ వద్ద గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఓ కారు బోల్తా పడింది. ఛత్తీస్‌గఢ్ నుంచి శ్రీకాకుళానికి ఏడుగురు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చల్లపల్లి రవివర్మ, తవుడు, ఈశ్వరమ్మతో పాటు.. చిన్నారులు నిషాంతవర్మ, గౌరీవర్మలు గాయపడ్డారు. మిగిలిన వారికి కూడా దెబ్బలు తగిలాయి.
క్షతగాత్రుల్లో ఒకరు 100కు కాల్ చేసి ప్రమాదంపై వివరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం విజయనగరం జిల్లా సరిహద్దులో ఉంది. ఆ స్థలం నుంచి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం పోలీస్‌స్టేషన్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాల్ ద్వారా సమాచారం అందుకున్న వీరఘట్టం పోలీసులు తమ పరిధి కాకున్నా చొరవ తీసుకుని హుటాహుటిన ప్రమాద స్థలానికి బయల్దేరారు.
వీరఘట్టం ఎస్‌ఐ జి.భాస్కరరావు, హెచ్‌సీ టి.పోలయ్య తదితరులు 108 సాయంతో బాధితులను సకాలంలో పార్వతీపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి పార్వతీపురంలోనే వైద్య సేవలు అందించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైజాగ్ తరలించారు. సమయానికి వైద్యం అందడంతో వారందరూ కోలుకుంటున్నారు.
మా డ్యూటీ మేం చేశాం..: ప్రమాదం జరిగిన స్థలం మాకు 11 కి.మీ. దూరంలో ఉంది. ఇదే స్థలం విజయనగరం జిల్లా గరుగుబిల్లి పోలీస్‌స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే వారు వచ్చేసరికి ఆలస్యమవుతుందని గ్రహించి వెంటనే మా డ్యూటీ మేం చేశాం. క్షతగాత్రులను పార్వతీపురం తరలించి వైద్యం అందించాం. – జి.భాస్కరరావు, ఎస్‌ఐ, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment