రాకేష్‌ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా  | Police investigated the realtors associated with Rakesh Reddy | Sakshi
Sakshi News home page

రాకేష్‌ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా 

Published Fri, Feb 22 2019 12:44 AM | Last Updated on Fri, Feb 22 2019 10:17 AM

Police  investigated the realtors associated with Rakesh Reddy - Sakshi

హైదరాబాద్‌: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యలో ప్రధాన సూత్రధారి రాకేష్‌రెడ్డి అక్రమాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కస్టడీలో భాగంగా రాకేష్‌ రెడ్డిని విచారిస్తున్న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆశ్చర్యపోయే రీతిలో అతడి అక్రమ లీలలు తెలుస్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు, హత్యలతో గత ఏడాదిన్నర కాలంగా అటు పోలీసులతోను, ఇటు అధికారులతోను సంబంధాలు పెట్టుకొని రాకేష్‌ రెడ్డి ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. జయరాంను హత్య చేసిన తర్వాత రాకేష్‌రెడ్డి ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న ఘటనలో ఆ ముగ్గురినీ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా రాకేష్‌రెడ్డితో సంబంధాలున్నట్లు కాల్‌డేటాలో తెలుసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు చింతల్, కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన శ్రీధర్, రాజేశ్‌ అనే ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను గురువారం విచారించారు. రాకేష్‌రెడ్డితో వారికి ఎలాంటి సంబంధాలున్నాయి? ఎప్పటి నుంచి పరిచయం అన్నదానిపై ఆరా తీశారు. కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో అక్రమాలు, కబ్జాలకు పాల్పడినట్లు తెలిసింది. వీటిపై కూడా  ఆరా తీసినట్లు పోలీసులు చెబుతున్నారు.  

విచారణకు సంతోష్‌రావు కూడా..  
అనంతరం శిఖా చౌదరి సన్నిహితుడు సంతోష్‌రావు అలియాస్‌ శ్రీకాంత్‌రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. జయరాం గత నెల 31న హత్యకు గురికాగా అదేరోజు రాత్రి శిఖా చౌదరి తన స్నేహితుడు సంతోష్‌రావుతో అనంతగిరి ప్రాంతానికి నైట్‌రైడింగ్‌కు వెళ్ళినట్లు చెప్పడంతో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సంతోష్‌రావును పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఆమెతో ఎలాంటి సంబంధాలున్నాయి? ఎప్పటి నుంచి సంబంధాలున్నాయి? జయరాం హత్య జరిగిన విషయం ఎప్పుడు తెలిసింది? హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరిని కలిశారా అన్న కోణంలో విచారణ జరిగింది. వీరిద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు ఉండేవన్న దానిపై కూడా ఆరా తీశారు. అటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను, ఇటు సంతోష్‌రావును వేర్వేరుగా నాలుగు గంటల పాటు విచారించారు. శుక్ర, శని వారాల్లో కూడా ఇంకో 30 మంది వరకు విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరందరికీ పోలీసులు ఫోన్లు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న పలువురు రాజకీయ నాయకులు కూడా విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement