సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నగరం రౌడీల నిలయంగా మారిపోయిందా...నేరాలు, ఘోరాలు సర్వసాధారణంగా మారిపోతున్నాయా..అని ప్రశ్నించుకుంటే పోలీసుల రికార్డులను బట్టి అవుననే సమాధానం వస్తోంది. బుధవారం తెల్లవారుజాము నాటి సంఘటనతో చెన్నైలో రౌడీల సామ్రాజ్యమే వేళ్లూనుకుని పోయిందనే విమర్శలు వినపడుతున్నాయి. రౌడీలతో కలిసి జన్మదినాన్ని జరుపుకున్న బినును తదితర రౌడీలపై కాల్పులు జరిపైనా పట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. కాగా పట్టుబడిన రౌడీలు గగుర్పొడిచే అనేక విషయాలను పోలీసులకు వెల్లడించారు.
చెన్నై శివార్లలో బుధవారం తెల్లవారుజామున 150 మందితో కూడిన రౌడీలతో కలిసి చెన్నై సూలైమేడుకు చెందిన పేరొందిన రౌడీ బిను జన్మదినాన్ని బహిరంగంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 75 మంది పోలీసులకు పట్టుబడగా 50 మంది పరారయ్యారు. భారీ సంఖ్యలో మారణాయుధాలు స్వాధీనం వార్త స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాపులు, బెదిరింపులతో కూడిన పంచాయితీలు, డబ్బు కోసం ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడని 150 మంది యువకులు ఒకేచోట చేరి సంబరాలు జరుపుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రప్రథమమని అంటున్నారు. రౌడీల ఆగడాలను అణచివేసేందుకు ప్రత్యేకంగా ఒక పోలీసు బృందం 15 ఏళ్లుగా పనిచేస్తోంది. గతంలో కొందరు రౌడీలను పోలీసులే ఎన్‌కౌంటర్ చేసి కాల్చి చంపారు. అయినా...నగరంలో కొత్త రౌడీలు పుట్టుకురావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. పట్టుబడిన రౌడీల నేర చరిత్రను బట్టీ ఏబీసీలుగా విభజించి రికార్డులను తయారు చేసుకున్నారు. చెన్నైలో హత్య, హత్యాయత్నం, కిడ్నాపు నేరాలకు పాల్పడిన 4,180 మంది జాబితా పోలీసుల రికార్డుల్లో ఉంది. వీరందరిపై పోలీసులు నిరంతర నిఘా పెట్టి ఉంచారు. రౌడీయిజాన్ని అణచివేసేందుకు వారిపై కఠినమైన గూండా చట్టాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. గత ఏడాది 880 మంది రౌడీలపై గూండా చట్టం కింద కేసులు పెట్టారు. ఇంత కసరత్తు చేస్తున్నా ఏమాత్రం లెక్కచేయని రీతిలో రౌడీలంతా కలిసి మారణాయుధాలతో జన్మదిన సంబరాలను జరుపుకున్నారు.
నకిలీ జర్నలిస్టులు, న్యాయవాదులు:
బిను జన్మదిన సంబరాల శిబిరంపై పోలీసులు దాడి చేసినపుడు కొందరు వ్యక్తులు తాము జర్నలిస్టులమని, కవరేజీ కోసం వచ్చామని గుర్తింపుకార్డు చూపి వాదులాటకు దిగారు. అలాగే న్యాయవాదులమంటూ గుర్తింపు కార్డులను చూపిస్తూ కొందరు వ్యక్తులు పోలీసులను ఎదిరించారు. అయితే వారివాదనను పట్టించుకోని పోలీసులు అందరినీ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి గుర్తింపు కార్డులను పరిశీలించగా అన్ని నకిలీవని తేలింది. దీంతో అందరినీ అరెస్ట్ చేసి గురువారం కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. పట్టుబడిన వారిలో 20 మంది కాలేజీ విద్యార్థులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పరారైన రౌడీల్లో పాతనేరస్తుడైన ఒక మాజీ ప్రముఖ నటి తమ్ముడు సైతం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అంతేగాక వృత్తిపరమైన విభేదాలతో ఐదుగురు రౌడీలను హత్యచేసేందుకే బిను తన జన్మదినానికి వారిని ఆహ్వానించినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
బినుపై 25 ఏళ్ల నేర చరిత్ర:
ఇదిలా ఉండగా, రౌడీలతో కలిసి బుధవారం జన్మదినం జరుపుకుంటూ పోలీసులకు చిక్కకుండా పరారైన బినుకు 25 ఏళ్ల నేరచరిత్ర ఉందని పోలీసులు తెలుసుకున్నారు. కేరళ రాష్ట్రం నుంచి చిన్నవయసులోనే చెన్నైకి వచ్చిన బిను పూర్తి పేరు బిను పాప్పచ్చన్, చెన్నైలో ఉంటూ చిన్నపాటి నేరాలతో జీవితం ప్రారంభించాడు. క్రమేణా హత్యలు, కిడ్నాపులు, పంచాయితీలకు దిగి రౌడీల నాయకుడిగా ఎదిగాడు. తనను ఎదిరించిన ముగ్గురు వ్యక్తులను తలను నరికి మొండం నుంచి వేరుచేసి, ముఖం గుర్తుపట్టలేకుండా చిదిమివేయడంతో అతడిని ‘తలనరికిన బిను’ అనే కోడ్ నామధేయం అతనికి స్థిరపడింది. మూడు క్రూరమైన హత్యలు చేయడంతో ‘తల’ (నాయకుడా) అని పేరుతో రౌడీల సర్కిల్‌లో గౌరవం, సహచర ముఠా సంఖ్యను పెంచుకున్నారు. రౌడీయిజంతో ఆర్జించిన సొమ్ముతో తన స్వరాష్ట్రమైన కేరళకు వెళ్లడం, కొన్నాళ్లు జల్సా చేసి చెన్నైకి చేరుకోవడం బినుకు పరిపాటి. బుధవారం నాటి జన్మదిన ఖర్చుల కోసం ఒక బిల్డర్‌ను బెదిరించి రూ.54 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జన్మదిన సంబరాలపై పోలీసులు మెరుపుదాడి చేయడంతో తన సహచరులతో కలిసి బైక్‌లోనే కేరళకు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారైన రౌడీలను పట్టుకునేందుకు ఏర్పడిన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాల్లో రెండు బృందాలు కేరళకు వెళ్లాయి.
కాల్చివేతకు ఉత్తర్వులు : పరారైన రౌడీల్లో సినీనటి తమ్ముడు
Published Fri, Feb 9 2018 8:20 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment