సాక్షి, బెంగుళూరు: అతిగా ఆశ పడితే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు. అసాధ్యమైన హామీలిచ్చి దాదాపు 800 మంది నుంచి రూ.300 కోట్ల వరకు పెట్టుబడుల పేరుతో రాబట్టిన విక్రం ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మోసపోయిన వారిలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రకాశ్ పదుకొనె వంటి వారున్నట్టు సమాచారం.
పెట్టుబడులపై 40 శాతం వరకు లాభాలు ఆర్జించి పెడతామని నమ్మబలికిన సదరు సంస్థ అందరికీ శఠగోపం పెట్టింది. మోసానికి పాల్పడిన విక్రం ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ చాలా తెలివిగా పేరు మోసిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుంది. వారిలో బెంగుళూరులోని ప్రముఖ క్రీడా పాత్రికేయుడు సుత్రం సురేష్ ఒకరు. ఈయన క్రీడా ప్రముఖుల నుంచి పెట్టుబడలను ఆకర్షించడంలో కీలకంగా పనిచేసినట్టు తెలుస్తోంది.
పలుకుబడి గల ఏజెంట్లతో సినిమా, క్రీడా, రాజయకీయ, వ్యాపార రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ బురిడీ కొట్టించింది. సంస్థ యజమాని రాఘవేంద్ర శ్రీనాథ్, ఏజెంట్లు సురేష్, నరసింహమూర్తి, కేసీ నాగరాజ్, ప్రహ్లాద్‌లను పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల కస్టడీకి తరలించారు. నిందితులు తెలిపిన వివరాల ప్రకారం సదరు సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెప్పారు. దీనిపై పత్రికల వాళ్లతో మాట్లాడేందుకు ప్రకాశ్ పదుకొనే సహాయకుడు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment