పూనం కౌర్‌ కేసు.. 36 యూట్యూబ్‌ లింక్‌లు | Poonam Kaur Case Speed up Hyderabad Police | Sakshi

పూనం కౌర్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

Apr 18 2019 8:09 AM | Updated on Apr 18 2019 8:09 AM

Poonam Kaur Case Speed up Hyderabad Police - Sakshi

అభ్యంతకరమైన వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ సినీ నటి పూనం కౌర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సాక్షి, సిటీబ్యూరో: తనకు సంబంధించి అభ్యంతకరమైన వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ సినీ నటి పూనం కౌర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం మరోసారి సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు వచ్చిన ఆమె వాంగ్మూలంతో పాటు కేసుకు సంబంధించిన వివరాలను అందజేశారు. మంగళవారం పూనం తన ఫిర్యాదుతో పాటు 36 యూట్యూబ్‌ లింక్‌లు అందించగా... వీటిలో కొన్ని బుధవారానికి డిలీట్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకురాళ్లు వైఎస్‌ షర్మిళ, నందమూరి లక్ష్మీపార్వతి సైతం ఇప్పటికే తమపై జరుగుతున్న దుష్ఫ్రచారంపై గతంలోనే సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూడు కేసుల వెనుకా ఒకరే ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు, వారికి సంబంధించిన వారిపై బురద జల్లేందుకు, దుష్ఫ్రచారం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.

గతంలో షికారు చేసిన పుకార్లు, అభ్యంతరకరమైన విషయాలను మరోసారి కొత్తగా ఎన్నికలకు ముందు యూట్యూబ్‌ ద్వారా ప్రచారం చేసినట్లు భావిస్తున్నారు. ఓ సందర్భంలో తన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుండగా వాటిని రికార్డు చేసిన కొందరు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు పూనం కౌర్‌ పోలీసులకు తెలిపారు. ఎన్నికల కుయుక్తుల్లో భాగంగా మహిళలపై టీడీపీ శ్రేణులు యూట్యూబ్‌ వీడియోలను ఎక్కుపెట్టి కించపరిచినట్లు, తద్వారా వారిని మానసికంగా దెబ్బతిసేందుకు ప్రయత్నించినట్లు అనుమానాలు రేగుతున్నాయి. పై మూడు కేసుల్లోనూ దుండగులు దాదాపు ఒకే తరహా విధానం అవలంభించారు. ఈ నేపథ్యంలో వీటి వెనుక ఉన్నది ఒకరేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు. షర్మిల కేసులో అరెస్టైన వారికి మిగిలిన రెండు కేసుల్లోనూ అనుమానితులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మూడు కేసులను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఐపీ అడ్రస్‌లు, లాగిన్‌ ఐడీలు వంటి సాంకేతిక అంశాలు, ఆధారాల కోసం వేచి చూస్తున్న పోలీసులు అవి వస్తే ఈ మూడు కేసుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. పూనం కౌర్‌ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే బాధ్యులను పట్టుకుంటామని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ బుధవారం మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement