గర్భిణిని హాస్పిటల్‌కు మోసుకు వెళ్తున్న బంధువులు
జయపురం : గ్రామానికి సరైన రోడ్డులేదు. కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా ఉన్న రోడ్డు బరదమయమైంది. అంబులెన్స్ వచ్చి రోడ్డు బాగోలేక మార్గంలో ఆగిపోయింది. ఈ కారణాలతో నిండు చూలాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక ప్రసవం అనంతరం మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి.
నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి మైదల్‌పూర్ గ్రామ పంచాయతీ మారుమూల కుసుముకుంటి గ్రామానికి చెందిన విమల నాయక్ సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు 102 అంబులెన్స్‌కు ఫోన్లు చేశారు.
అయితే అంబులెన్స్ ఆ గ్రామానికి వెళ్లేందుకు తగిన రోడ్డు లేక పోవడంతో రాలేక మార్గంలో నిలిచిపోయింది. దీంతో ఆ మహిళ నొప్పులతో మెలికలు తిరుగుతుండడంతో బాధ చూడలేక ఒక మంచానికి తొట్టి కట్టి అందులో ఆమెను కూర్చుండ బెట్టి బంధువులు 10 కిలోమీటర్లు మోసుకువెళ్లారు.
అక్కడ ఆగి ఉన్న అంబులెన్స్ కనిపించడంతో అందులో ఆమెను మైదల్‌పూర్ ప్రాథమిక వైద్యకేంద్రానికి తీసుకువెళ్లారు. హాస్పిటల్‌లో ఆడబిడ్డను ప్రసవించిన తరువాత ఆమె మరణించింది. సకాలంలో ఆస్పత్రికి తీసుకు రాలేక పోవడం వల్ల రహదారి లేక 10 కిలోమీటర్లు మోసుకురావడం వల్ల ఆమె మరణించిందని బంధువులు విలపించారు.
తమ గ్రామానికి తగిన రోడ్డు లేకపోవడమే విమల నాయక్ మరణానికి కారణమని, అందుకు అధికారులే బాధ్యులని కొంతమంది ఆరోపిస్తున్నారు. తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు తగు చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ఇకనైనా వెంటనే తమ గ్రామానికి పక్కా రహదారి వేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment