మృతురాలి భర్త, అత్త, మామలను స్టేషన్‌కు తీసుకెళ్తున్న పోలీసులు, రాజేశ్వరి(ఫైల్)
మరికొన్ని రోజుల్లో సీమంతం జరుపుకోవాల్సి గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాత్రూంలో జారిపడి ప్రాణాలు కోల్పోయిందని మెట్టినింటి వారు చెబుతుండగా.. భర్త, అత్తమామలే హత్య చేసి.. ప్రమాదవశాత్తూ మరణించిందని చిత్రీకరిస్తున్నారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు.
అనంతపురం, ధర్మవరం అర్బన్ : గర్భిణి అనుమానాస్పద మృతి ధర్మవరంలో కలకలం రేపింది. మృతురాలి పుట్టింటి వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన లేట్ వెంకటాచలపతి, శాంతమ్మ దంపతుల నాల్గవ కుమార్తె రాజేశ్వరి(26)ని శాంతినగర్‌కు చెందిన కుంటుమల్ల సుజాత, లక్ష్మినారాయణ దంపతుల కుమారుడు నరేష్‌కి ఇచ్చి ఏడు నెలల క్రితం వివాహం చేశారు. నరేష్ శాంతినగర్‌లోనే ఉన్న జింకా రామాంజనేయులు మగ్లా బిల్డింగ్‌లో మగ్గం నేస్తూ అక్కడే తన భార్య, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. రాజేశ్వరి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. మూడు నెలలుగా ఆమెను అదనపు కట్నం కోసం భర్త, అత్త,మామలు వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంటి పని విషయంలోనూ వంకలు పెడుతూ అత్త సూటిపోటి మాటలు అనేది. అత్తింటివారు తనను హింసిస్తున్నారని రాజేశ్వరి పుట్టింటి వారికి తెలిపేది. వారు సర్దిచెబుతుండేవారు. వచ్చే నెలలో సీమంతం చేయాలని పుట్టింటివారు నిర్ణయించారు.
సీమంతానికి ముందే తిరిగిరాని లోకాలకు..
శుక్రవారం ఉదయం నరేష్ తన అత్త శాంతమ్మకు ఫోన్ చేసి మీ కూతురు బాత్రూమ్‌లో జారిపడి మృతి చెందిందని సమాచారం ఇచ్చాడు. పుట్టింటి వారు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అక్కడ విగతజీవిగా పడి ఉన్న రాజేశ్వరిని చూసి రోదించారు. ఆమె గొంతుకు బిగించినట్టు, వీపుపై కొట్టిన వాతలు తేలి ఉండటాన్ని గమనించి అనుమానం వ్యక్తం చేశారు.
అత్తింటి వారిపై ఫిర్యాదు
అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించి, చిత్రహింసలకు గురి చేశారని రాజేశ్వరి తల్లి శాంతమ్మ, అన్న మల్లికార్జున, అక్క శ్రీదేవి విలపించారు. వారే చంపేసి.. బాత్రూమ్‌లో జారిపడి మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు అత్తింటివారిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం భర్త నరేష్, అత్తమామలు సుజాత, లక్ష్మీనారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతు రాలి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సూర్యనారాయణ పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం రూ.10వేల ఆర్థికసాయం అందించారు. అనంత రం సీఐ హరినాథ్‌కు ఫోన్ చేసి మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment