లక్ష్మి మృతదేహం
నార్నూర్(ఆసిఫాబాద్): ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు అన్నిరకాల వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నాం.. ప్రతీకాన్పు సర్కారు దవాఖానాలో జరిగేలా చర్యలు తీసుకోవాలని గొప్పలు చెప్పుకోనే వైద్యశాఖ అధికారులు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని గుండాల గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (30) 9నెలల గర్భిణి శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మికి జైనూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన సుందర్‌షావ్‌తో గతేడాది వివాహమైంది. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. శనివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అక్కడ పరిశీలించిన వైద్యులు స్కానింగ్ చేశారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లు రిపోర్టు రావడంతో ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సైతం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రమాదమని భావించిన వైద్యులు ఆపరేషన్ కోసం తరలిస్తుండగా మహిళ మృతి చెందింది. సకాలంలో వైద్యం అందించి ఉంటే లక్ష్మి ప్రాణాలు దక్కేవని, వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్కారు ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment