
వేగవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాధ
జంగారెడ్డిగూడెం రూరల్ :కొద్దిరోజుల్లో ఈ లోకాన్ని చూడాల్సిన ఓ చిన్నారి తన తల్లితో పాటు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. వీరి పాలిట ఓ లారీ వీరి జీవితాల్లో మృత్యువుగా కబళించింది. బంధువులు వచ్చారని మంచి కూరలు వండి పెడదామనుకుని మార్కెట్ వెళ్లే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది ఆ గర్భిణి. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పెట్రోల్ బంక్ సమీపంలో మోటారు సైకిల్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో 9 నెలల నిండు గర్భిణి మృతి చెందింది. విశాఖ జిల్లా మూలపేట మండలం గడ్డిబంద గ్రామానికి చెందిన చీదర గణేష్, రాధ దంపతులు మండలంలోని వేగవరంలో మాదాసు శ్రీనుకు చెందిన కోళ్లఫారంలో మకాం పనులకు చేరారు.
సంవత్సర కాలంగా వీరు ఇక్కడే నివసిస్తూ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి ఇంటికి బంధువులు రావడంలో మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెద్దామని గణేష్ బయలు దేరే క్రమంలో తాను కూడా వస్తానంటూ రాధ మోటారు సైకిల్ ఎక్కింది. వీరు ప్రయాణిస్తున్న మోటారుసైకిల్‌ను పెట్రోల్ బంక్ సమీపంలో పామాయిల్ గెలలు తరలించే లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ రాధ (27) తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గణేష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రాధ 9 నెలలు గర్భిణి కావడంతో కొన్నిరోజుల్లో ఆ చిన్నారి ఈ లోకాన్ని చూడాల్సి ఉంది. ఈ ప్రమాదంతో రెండు ప్రాణాలు పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాధ మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం చేసి మృతి చెందిన మగబిడ్డను బయటకు తీశారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్సై డీజె విష్ణువర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment