ఖైదీ వీరాపాణిని కోర్టు ఆవరణ నుంచి కేజీహెచ్‌కు తరలిస్తున్న పోలీసులు
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ కేంద్ర కారాగారంలో సిబ్బంది తనను కొట్టారంటూ ఓ ఖైదీ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. అయితే ఖైదీని తాము కొట్టలేదని జైల్ అధికారులు అంటున్నారు. సెల్ ఫోన్ వాడకం ఈ రచ్చకు కారణమైందని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ కేంద్ర కారాగారంలో సుమారు ఏడాది నుంచి శిక్ష అనుభవిస్తున్న మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వీరాపాణి అనే ఖైదీ సోమవారం వాయిదాకు కోర్టుకు వెళ్లాడు. అక్కడ న్యాయమూర్తితో జైల్‌లో సిబ్బంది తనను అకారణంగా కొట్టారని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు కేజీహెచ్‌కు చికిత్స కోసం తరలించారు. అక్కడ వీరాపాణికి న్యాయవాది సమక్షంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జైల్ అధికారులు మాత్రం వీరాపాణిని ఎవరూ కొట్టలేదని చెప్పారు.
అతనిపై 8 కేసులున్నాయని జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. వాటిలో మూడు హత్య కేసులు, రెండు అత్యాచారం కేసులున్నాయన్నారు. మొదట్లో కొన్నాళ్లు రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తుండగా ప్రవర్తన బాగాలేకపోవడంతో కడప జైల్‌కు, అక్కడి నుంచి నెల్లూరు జైల్‌కు తరలించారని, అక్కడ ప్రవర్తన బాగాలేకపోవడంతో ఏడాది క్రితం విశాఖపట్నం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ఉంటూ పెరోల్‌పై బయటకు వెళ్లడానికి విశాఖ పోలీస్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసు నమోదైందన్నారు. ఆ కేసుపై విశాఖ కోర్టుకు వాయిదాలకు వెళ్తున్నాడరన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న కోర్టుకు వాయిదాకు వెళ్లి తిరిగి జైల్‌కు వచ్చినప్పుడు సెల్‌ఫోన్ తీసుకొచ్చాడని, సిబ్బందికి తెలియకుండా దాన్ని లోపలకు తీసుకెళ్లాడన్నారు. జైల్ లోపల నుంచి ఫోన్‌లో బయటవారితో మాట్లాడుతుండగా సిబ్బంది గమనించి ఫోన్ తీసుకొన్నారన్నారు. దీంతో తనను కొట్టినట్లు జడ్జికి అబద్ధం చెప్పాడన్నారు.
జైలు లోపలికి ఫోన్ ఎలా వెళ్లిందో..?
జైలు బయట కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. జైల్ లోపల కూడా అదేమాదిరిగా భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు అమర్చారు. వాయిదాలకు వెళ్లి వచ్చే ఖైదీలను ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది చెక్ చేస్తారు. వారి బంధువులు, స్నేహితులు తీసుకొచ్చిన ఆహార పదార్ధాలను (మిక్చర్, బిస్కెట్లు లాంటివి) పరిశీలిస్తారు. ఇంతచేసినా వీరాపాణి వద్దకు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనేది చర్చనీయాంశమవుతోంది. వాయిదా నుంచి తిరిగి లోపలకు ప్రధాన ద్వారం నుంచే ఏ ఖైదీ అయినా వెళ్లాల్సిందే. ఈ నెల 6న వాయిదా నుంచి తిరిగి జైల్‌కు వెళ్లిన వీరాపాణి వద్ద సెల్ ఫోన్ ఉన్నట్లు ఎందుకు గుర్తించలేకపోయారు? గుర్తించినా చూసీచూడనట్లు వదిలేశారా? ఖైదీలు ఉండే ప్రతి బ్యారెక్ వద్ద సీసీ కెమెరాలున్నాయి. వాటిని నిరంతరం మానటిరింగ్ హాల్‌లో అబ్జర్వ్ చేస్తారు. వారికి కూడా తెలియకుండా వీరాపాణి ఎలా మాట్లాడగలిగాడు..? జైల్‌లో సెల్‌ఫోన్‌లు ఇంకెంతమంది ఖైదీల వద్ద ఉన్నాయో..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ జైల్ లోపల పరిస్థితి ఎంత పటిష్టంగా ఉందో అనే విషయం తెలుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment