
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరతంపై ఓ ఖైదీ దాడికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడిలో గాయపడి చెయ్యి విరిగిన జైలు అధికారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా దాడి జరగలేదని పెనుగులాట మాత్రమే జరిగిందని జైలు పర్యవేక్షణాధికారి ఎం.ఆర్. భాస్కర్ అంటున్నారు. అసదుద్దీన్ ఒవైసీపై దాడి కేసులో పదేళ్ల జైలు శిక్షపడిన మహ్మద్ పహిల్వాన్ అనుచరుడు అహ్మద్‌బీన్ సౌద్ జైల్‌లోని స్వర్ణముఖి బ్యారక్‌లో ఉంటున్నాడు.
అతను సెల్‌ఫోన్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న జైలు అధికారులు అతనిపై నిఘా పెట్టారు. అందులో భాగంగా ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరతం ఆకస్మిక తనిఖీ చేసి సెల్‌ఫోన్‌ను గుర్తించారు. ఆ సెల్‌ఫోన్‌ను స్వా ధీనం చేసుకునే క్రమంలో అహ్మద్‌బీన్ సౌద్ విచక్షణ కోల్పోయి దశరతంపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దశరతం చెయ్యి విరగడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు. ఈ నెల 1న ఆయన చేతికి శస్త్ర చికిత్స చేశారు. ఇదంతా జరిగి 10 రోజులు గడుస్తున్నా విషయం బయటకు తెలియకుండా జైలు అధికారులు గుట్టుగా వ్యవహరించారు. ఈ ఘటనపై జైలు పర్యవేక్షణాధికారి భాస్కర్‌ను వివరణ కోరగా దాడి జరగలేదని, సెల్ స్వాధీనం చేసుకునే క్రమంలో పెనుగులాట జరిగిందంటూ సమాధానం చెప్పడం గమనార్హం.
సెల్‌ఫోన్లు, మద్యం బాటిళ్లు జైల్లోకి ఎలా వచ్చాయి?
అహ్మద్‌బీన్ సౌద్ ఉంటున్న బ్యారక్‌లో సెల్‌ఫోన్‌తో పాటు మద్యం బాటిళ్లు కూడా లభ్యమైనట్లు తెలిసింది. ఇంత సెక్యూరిటీ ఉన్నా జైలులోకి నిషిద్ధ వస్తువులు ఎలా ప్రవేశించాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు చర్లపల్లి జైలు పర్యవేక్షణాధికారి భాస్కర్ తెలిపారు.