రంగుల ప్రపంచానికి పరిచయం చేస్తా..బుల్లి తెరపై మిమ్మల్ని చూపిస్తా.. మీ జీవితాన్ని మారుస్తా.. అంటూ షార్ట్ ఫిల్మ్‌ల పేరుతో భారీగా నగదు కాజేస్తూ అందమైన బాలికలు, యువతులను ఆకర్షిస్తాడు. వారికి కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్పిస్తున్నట్లు నటిస్తూ ముగ్గులోకి దించుతాడు. అసహజ రీతిలో లైంగిక వాంఛ తీర్చుకునే క్రమంలోనే ఆ ప్రక్రియనంతా రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత వాటిని చూపించి భారీగా డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తాడు. డబ్బులు ఇవ్వని వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతాడు. వారితోనే వ్యభిచార గృహాలు ఏర్పాటు చేస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
నెల్లూరు(క్రైమ్): షార్ట్ ఫిల్మ్‌లు.. వీటిని వెనుక ఎన్నో చీకటి చిత్రాల రీళ్లు. ఈ రంగుల వలలో పడిన ఎందరో బాలికలు, యువతులు చీకటి జీవితాలు గడుపుతూ తమ జీవిత కలను చిదిమేసుకుంటున్నారు. గురువారం ఈ ముఠాను పట్టుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు సభ్య సమాజం విస్తుపోయే ఎన్నో చీకటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చీకటి ఫిల్మ్‌లపై హోంశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు.
జిల్లాలోని అల్లూరుకు చెందిన షేక్ జాకీర్‌హుస్సేన్ అలియాస్ మహేష్ కుటుంబం కొన్నేళ్ల కిందట నెల్లూరు నగరానికివచ్చింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అతను మరణించడంతో కారుణ్య నియామకం కింద తల్లికి ఉద్యోగం వచ్చింది. మంచి మాటకారి కావడంతో ఎదుటి వారిని ఇట్టే తన మాటలతో ఆకర్షించేవాడు. కొంత కాలం మార్కెటింగ్ రంగంలో పనిచేసిన అతను షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా, ఈవెంట్స్ నిర్వాహకుడిగా అవతారమెత్తాడు. నెల్లూరులో స్టార్ట్‌గన్ పేరుతో ఇన్‌స్టిట్యూషన్‌ను ఏర్పాటు చేశాడు. షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తున్నాని, సినిమా, బుల్లితెరలో అవకాశాలు కల్పిస్తానని బాలికలు, యువతులకు ఎరవేశాడు. అతని వలలో పడిన బాలికలు, యువతులకు కెమెరా ముందు ఎలా వ్యవహరించాలో నేర్పిస్తున్నట్లు నటిస్తూ వారిని మెల్లగా తన వైపు ఆకర్షించేవాడు.
విలాస జీవనానికి అలవాటు చేసి..
ఖరీదైన కార్లు, విలాస వంతమైన జీవనానికి అలవాటు చేసి పూర్తిగా లోబర్చుకునేవాడు. అసహజ రీతిలో లైంగిక వాంఛ తీర్చుకునే క్రమంలోనే ఆ ప్రక్రియనంత రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించేవాడు. వాటి ద్వారా వారిని బెదిరించి నగదు గుంజేవాడు. నగదు ఇవ్వని వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించేవాడు. వారిని విటుల వద్దకు పంపి వచ్చిన నగదులో అధిక మొత్తం అతను తీసుకుని పదో పరకో వారికి ఇచ్చేవాడు. వారితో వ్యభిచార గృహాలు ఏర్పాటు చేసేవాడు. పెద్ద ముఠాగా అవతరించారు.
ఈవెంట్స్ పేరిట.. మీడియా ప్రతినిధి మీడియేషన్
పండగలు, పబ్బాలకు ఈవెంట్స్ నిర్వహణ పేరిట పశ్చిమబెంగాల్, తెలంగాణ, బెంగళూరు, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి యాంకర్స్‌ను తీసుకు వచ్చేవాడు. ఈ వెంట్స్ అనంతరంతో వ్యభిచారం చేయించేవాడు. ఈ క్రమంలోనే అతనికి మీడియా ప్రతినిధి ప్రియాంకతో పరిచయం అయింది. ఆమె అతని నేర సామ్రాజ్యానికి తన వంతు సహకారం అందించింది. మీడియా ముసుగులో బడాబాబులను కలుసుకుని వారితో స్నేహాన్ని ఏర్పరచుకునేది. జాకీర్‌ను సైతం వారికి పరిచయం చేసేది. వారితో సన్నిహితంగా మెలుగుతూ వారికి అందమైన యువతులను పంపి రెండు చేతుల ఆర్జించేవారు. ఎక్కడైనా పోలీసులు అడ్డు తగిలితే మీడియా పేరిట వారిని బెదిరించడంతో పాటు బడాబాబులు ద్వారా ఫోన్లు చేయించేవారు. దీంతో ఎవరూ వారి జోలికి వెళ్లలేదు. సామాజిక మాధ్యమాల్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి సైతం ఈ దందాలో భాగస్వామి. దాదాపు నాలుగేళ్లుగా ఈ వ్యవహారం చాపకింద నీరులా సాగుతోంది. ఎంతో మంది బాలికలు, యువతులు, మహిళలు వీరి దాష్టీకానికి బలైపోయారు. వీరి కోరల్లో చిక్కుకున్న కొందరు ఎలా తప్పించుకోవాలో తెలియక ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలోనే కాకుండా బెంగళూరు, చెన్నై, పశ్చిమబెంగాల్, తెలంగాణ తదితర ప్రాంతాలకు తమ నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ప్రాంతాల్లో అమ్మాయిలు కావాలంటే క్షణాల్లో సమకూర్చసాగారు.
రెండు నెలల కింద పట్టుకుని వదిలేశారు?
జాకీర్ హుస్సేన్ వ్యవహారం రెండు నెలల కిందటే బయటపడినట్లు సమాచారం. తన స్నేహితుడి స్నేహితురాలిని జాకీర్ హుస్సేన్ ట్రాప్ చేసి ఆమెతో వ్యభిచార కేంద్రం నిర్వహించే వాడని సమాచారం. ఈ విషయమై బాధితుడు అప్పట్లో నగరంలోని ఓ పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు. సదరు అధి కారి జాకీర్‌హుస్సేన్, మహిళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారి వద్ద నుంచి అమ్యామ్యాలు గుంజేసి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. దీనిపై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే క్రమంలో కోవూరుకు చెందిన ఓ బాలిక సైతం ఈ ముఠా వ్యవహారంపై పోలీసు బాస్‌కు ఫిర్యా దు చేసింది. దీంతో టాస్క్‌ఫోర్సు బృందం రంగంలోకి దిగింది. ప్రధాన నిందితుడితో పాటు వ్యభిచార కేంద్ర నిర్వాహకు లు, విటులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం లేవడంతో హోంశాఖ మంత్రి స్పందించారు. పూర్తిస్థాయిలో విచారించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ రస్తోగి టాస్క్ ఫోర్స్ బృందంతో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
విస్తుగొలిపే అంశాలు
నిందితుడి సెల్‌ఫోన్ కాల్ డీటైల్స్‌ను సేకరించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడికి ఇతర రాష్ట్రాల్లోను సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు వలలో బడాబాబులు ఉన్నట్లు పోలీసులు పసిగట్టారు. పలు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు ఉన్నాయని తెలియడంతో వాటి నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment