
భార్య సుబితో జగన్(ఫైల్)
పంజాబ్‌లో నక్సల్ జరిపిన కాల్పుల్లో తమిళ వీరుడు మరణించారు. వీరోచితంగా ఎదురు కాల్పులు జరిపినా, చివరకు వీరుడు నేల కొరిగాడు. ఈ సమాచారం
మంగళవారం స్వగ్రామానికి చేరడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగింది. కన్యాకుమారిలోని పరుత్తి కాట్టు గ్రామానికి ఆ వీరుడి మృతదేహం బుధవారం చేరుకునే అవకాశం ఉంది.
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా వేలప్పన్, సీతాలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్దవాడు జగన్(38). వేలప్పన్ తన చిన్నతనంలోనే మరణించడంతో కుటుంబానికి జగన్ పెద్ద దిక్కు అయ్యాడు. చిన్నతనం నుంచి రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలబడ్డాడు. అంతే కాదు, భారత ఆర్మీలో చేరాలన్న సంకల్పంతో ముందుడుగు వేశాడు. 16 ఏళ్ల క్రితం భారత ఆర్మీలో చేరాడు. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో సేవల్ని అందించాడు. కుటుంబానికి తండ్రి స్థానంలో నిలబడ్డ జగన్, తన ఇద్దరు సోదరీమణులకు వివాహం చేసే వరకు తానూ చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నట్టే ఇద్దరు సోదరీమణులకు వివాహం చేశాడు. తమ్ముడ్ని ప్రయోజకుడ్ని చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ ఏడాది జనవరి 28వ తేదీ తన 38వ ఏట సుబిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సుబి ఏడు నెలల గర్భవతి. తాను తండ్రి కానున్న సమాచారంతో గత నెల సెలవు మీద స్వగ్రామానికి జగన్ వచ్చాడు. పదిహేను రోజుల క్రితం తిరుగు పయనం అయ్యాడు. ఎంతో ఆనందంగా జగన్‌ను కుటుంబీకులు పంపించారు. అయితే, మంగళవారం అందిన సమాచారం ఆ కుటుంబాన్ని తీవ్ర శోక సంద్రంలో ముంచింది.
పెద్ద దిక్కును కోల్పోయాం
సోమవారం పంజాబ్‌లో నక్సల్స్ కాల్పుల్లో జగన్ మరణించినట్టుగా సమాచారం అందగానే, ఆ కుటుంబం కన్నీటి మడుగులో మునిగింది. ఆ గ్రామమే శోకసంద్రం అయింది. పదిహేను రోజుల క్రితం అందర్నీ పలకరిస్తూ, ఎంతో ఆనందంగా దేశ సేవకు వెళ్లిన జవాను జగన్, జీవచ్ఛవంగా తమ ముందుకు రానుండడాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయమని తల్లి సీతాలక్ష్మి, భార్య సుబి, సోదరీమణులు, సోదరుడు విలపిస్తున్నారు. అన్నింటికి తాను ఉన్నానని, భరోసా ఇచ్చే జగన్ ఇక లేడన్న సమాచారాన్ని ఆ కుటుంబీకులు, ఆప్తులు జీర్ణించుకోలేని పరిస్థితి. సమాచారం అందుకున్న ఆ నియోజకవర్గ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్, పంజాబ్ నుంచి మృత దేహాన్ని ఇక్కడికి త్వరితగతిన తీసుకొచ్చేందుకు తగ్గ ఏర్పాట్లలో మునిగారు. జగన్ మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరే అవకాశం ఉంది. అదేరోజు ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment