అంతా ఆమేనట.. | Rambabu Murder Mystery Reveals Ramachandrapuram Police East Godavari | Sakshi
Sakshi News home page

అంతా ఆమేనట..

Published Wed, Sep 12 2018 11:06 AM | Last Updated on Thu, Sep 13 2018 5:52 PM

Rambabu Murder Mystery Reveals Ramachandrapuram Police East Godavari - Sakshi

తూర్పుగోదావరి, రామచంద్రపురం: పట్టణంలో గత నెల 26న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చెల్లూరి రాంబాబు మృతి కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రాంబాబు భార్య క్రాంతి తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీధర్‌కుమార్‌ ఆయన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తొలుత రాంబాబు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం రాంబాబు హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చి రాంబాబు భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. రాంబాబు భార్య క్రాంతి ప్రియదర్శినికి పట్టణంలోని శీలంవారిసావరానికి చెందిన కుడిపూడి మోహన్‌శివసాయికిశోర్‌తో వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో తన భర్తను అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ప్రియుడు కిశోర్‌తో హత్య చేసేందుకు నిర్ణయించుకుంది.

అందులో భాగంగా ఫోన్‌ ద్వారా మాట్లాడుకుంటే విషయం బయటపడుతుందని డమ్మీ ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లను మారు పేర్లు, అమ్మాయిల పేర్లతో ఓపెన్‌ చేసి మెసెంజర్‌ ద్వారా మాట్లాడుకుంటూ రాంబాబు హత్యకు కుట్రలు పన్నినట్టు సీఐ తెలిపారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న కిశోర్‌ పథకంలో భాగంగా గతనెల 25న శనివారం సాయంత్రం పట్టణానికి చేరుకున్నాడు. రాంబాబు నివాసం ఉంటున్న అపార్టుమెంటులోనే భార్య క్రాంతి, కిశోర్‌లు తాము వేసుకున్న పథకాన్ని అమలు చేశారు. అందులో భాగంగా భార్య క్రాంతి, రాంబాబుకు నిద్ర మాత్రలు ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన కిశోర్‌తో కలిసి రాంబాబు చేతులు కట్టివేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. ఈ మేరకు వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. కిశోర్‌ వద్ద నుంచి రూ.రెండు లక్షలు స్వాధీనంచేసుకున్నట్టు ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement