ఆస్ట్రేలియాలో రవిప్రకాశ్‌! | Ravi Prakash in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో రవిప్రకాశ్‌!

Published Sun, May 19 2019 2:44 AM | Last Updated on Sun, May 19 2019 3:11 PM

Ravi Prakash in Australia - Sakshi

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టీవీ9 కాపీ రైట్స్, ట్రేడ్‌మార్క్‌లను కేవలం రూ. 99 వేలకే మీడియా నెక్స్‌ట్‌ ఇండియా కంపెనీకి బదలాయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్డ్‌ డీడీలు అమలు చేశారంటూ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై కేసు నమోదవడం తెలిసిందే. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్‌ హాజరుకాకపోవడంతో ఆయన కోసం గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలో ఉన్నట్లు రెండు రోజుల క్రితం గుర్తించినప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్లే ముందురోజే రవిప్రకాశ్‌ జారుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టగా రవిప్రకాశ్‌ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు తెలిసింది.

పోలీసులు ఇప్పటికే బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లోని రవిప్రకాశ్‌ ఇంటితోపాటు ఆయన సన్నిహితుల ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. మరోవైపు టీవీ9 వాటాల వ్యవహారంలో తప్పుడు పత్రాలు సృష్టించడంతోపాటు సంతకం ఫోర్జరీ చేశారన్న కేసులో నిందితులైన రవిప్రకాశ్, నటుడు శివాజీ అచూకీ కోసం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. రవిప్రకాశ్, శివాజీల కోసం లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే రవిప్రకాశ్‌ ఇప్పటికే ఆస్ట్రేలియాకు జారుకున్నట్లు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ నోటీసుల వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనేది తెలియాల్సి ఉంది. 

పోలీసుల ముందు హాజరైన హరికిరణ్‌... 
టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లను అక్రమంగా బదలాయించుకున్న కేసులో మీడియా నెక్స్‌ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత హరికిరణ్‌ చెరెడ్డిపై కేసు నమోదవడంతో ఆయన శనివారం బంజారాహిల్స్‌ పోలీసుల ముందు హాజరయ్యారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎప్పుడు పిలిచినా హాజరవుతానని లిఖితపూర్వక లేఖను పోలీసులకు అందించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఎవో ఎంవీకేఎన్‌ మూర్తి ఇప్పటికే సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల విచారణకు హాజరవుతున్నారు.  

రవిప్రకాశ్‌ అడ్వొకేట్‌ ఇంట్లో సోదాలు.. 
టీవీ9 వాటాల వ్యవహరంలో తప్పుడు పత్రాలు సృష్టించారంటూ రవిప్రకాశ్‌పై నమోదైన కేసులో ఆయన అడ్వొకేట్‌ జె.కనకరాజ్‌ ఇంట్లో సైబరాబాద్‌ పోలీసులు శనివారం సోదాలు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 3లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కాలనీ ప్లాట్‌ నంబర్‌ 40లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేసి కీలక సాక్ష్యాలు సేకరించినట్లు తెలిసింది. 

వడదెబ్బ వల్ల విశ్రాంతి తీసుకుంటున్నా: శివాజీ 
తమిళనాడు, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల వడదెబ్బ తగలడంతో విశ్రాంతి తీసుకుంటున్నానని, తాను ఎక్కడికీ పారిపోలేదని శనివారం విడుదల చేసిన వీడియోలో శివాజీ పేర్కొన్నాడు. రవిప్రకాశ్‌కు, తనకు మధ్యలో ఉన్న చిన్న పంచాయితీని కొన్ని మీడి యా సంస్థలు చిలువలు పలువలుగా చేసి చూపిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ‘ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా కేసు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. పోరాడతా. మరికొంతకాలం విశ్రాంతి తీసుకొని బయటకు వస్తా. న్యాయం దొరకడం ఆలస్యం కావచ్చు కానీ చివరకు గెలుపు మాత్రం న్యాయానిదే’అని శివాజీ అన్నాడు. తెలంగాణ పోలీసులు, నాయకులతోపాటు ఏపీ నాయకులపై పలు ఆరోపణలు చేసిన శివాజీ... తాను ఎక్కడ ఉన్నదీ వీడియోలో వెల్లడించకపోవడం గమనార్హం. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
రవిప్రకాశ్‌ ఆస్ట్రేలియా జారుకున్నట్లు పోలీసుల అనుమానం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement