గొల్లలమామిడాడ హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న అడ్మిన్ ఎస్పీ కుమార్, ఇన్‌చార్జి డీఎస్పీ భీమారావు, సీఐ మురళీకృష్ణ, ఎస్సై లక్ష్మి. చిత్రంలో నిందితులు
సాక్షి, కాకినాడ రూరల్: అమ్మాయితో సెల్‌ఫోన్‌లో మాట్లాడిన మాటల రికార్డింగ్ వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. కాల్ రికార్డింగ్ వివాదం చినికిచినికి గాలివానలా మారి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తమ ఇంటిపైకి దాడికి వస్తారని భావించిన ఓ వర్గం, వచ్చిన వారిని తుదముట్టించాలని పథకం పన్నింది. కొందరు మనుషులను ముందుగానే తీసుకువచ్చి కత్తులతో మాటువేసింది. వారు ఊహించినట్టుగానే అర్ధరాత్రి సమయంలో ఇంటి పైకి వచ్చిన ముగ్గురిపై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆరుగురు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో ఫిబ్రవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక జరిగిన కొవ్వూరి ఇంద్రారెడ్డి(50) హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గురువారం ఉదయం కాకినాడలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఉదయం హత్య కేసు, నిందితుల వివరాలను అడ్మిన్ ఎస్పీ కరణం కుమార్, ఇన్‌చార్జి డీఎస్పీ బీమారావు, రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, పెదపూడి ఎస్సై లక్ష్మి వెల్లడించారు. గొల్లల మామిడాడలో కొవ్వూరి ఇంద్రారెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు మేడపాటి సూర్యనారాయణరెడ్డి(ఏ–1)తో పాటు బిక్కవోలుకు చెందిన జంపా రాజు(ఏ–2), ధనాల మనోజ్‌కుమార్(ఏ–3), తోట ద్రావిడ్(ఏ–4), బీరా సాయికుమార్(ఏ–5), పంపన విజయకుమార్(ఏ–6)లను అరెస్టు చేశామన్నారు.
హత్యకు వినియోగించిన కత్తులు
గొల్లల మామిడాడలో ఓ అమ్మాయితో సెల్ ఫోన్‌లో మాట్లాడిన మాటల కాల్ రికార్డింగ్ విషయమై మేడపాటి సూర్యానారాయణరెడ్డి తాడి ఆనందరెడ్డిని కొట్టాడు. ఈ విషయాన్ని ఆనందరెడ్డి తన మేనమాన కొవ్వూరి ఇంద్రారెడ్డికి చెప్పాడు. దీంతో ఫిబ్రవరి 29న అర్ధరాత్రి సమయంలో కొవ్వూరి ఇంద్రారెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపూడి సూర్యచంద్రారెడ్డి అడిగేందుకు సూర్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లారు. రోజంతా దీనిపై వివాదం నెలకొనడం, అడిగేందుకు ఇంటికి వస్తారని తెలుసుకున్న సూర్యానారాయణరెడ్డి ముందు జాగ్రత్తగా బిక్కవోలు నుంచి కొందరిని రప్పించుకుని, ఇంటి వద్ద కత్తులతో మాటు వేయించాడు. ఇంతలో కొవ్వూరి ఇంద్రారెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపూడి సూర్యచంద్రారెడ్డి అక్కడికి రాగా వారిపై కత్తులతో దాడి చేసి కత్తులతో నరికారు. అతను అక్కడికక్కడే రక్తపు మడుగులతో మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో పారిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మార్చి 1న ఉదయం ఏడు గంటలకు ఫిర్యాదు అందడంతో పెదపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య అనంతరం నిందితులు ఇతర ప్రాంతాలు పరారైనట్టు తెలుసుకుని సీఐ మురళీకృష్ణ, సిబ్బంది ఏలూరు, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలు గాలించారు. సూర్యనారయణరెడ్డి, రాజు, మనోజ్‌కుమార్, సాయికుమార్‌లో హైదరాబాద్‌లో బుధవారం ఒక టీవీ చానల్ వద్ద లొంగిపోవడానికి వెళ్లగా బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారమందుకున్న సీఐ మురళీకృష్ణ, సిబ్బందిని నిందితులను కస్టడీలోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే మరో ఇద్దరు ద్రావిడ్, విజయకుమార్‌లను కూడా అరెస్టు చేశారు. నిందితుల నుంచి కత్తులు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment