స్మగ్లర్లతో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది
ప్రొద్దుటూరు క్రైం : ఢిల్లీ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన నలుగురిని ప్రొద్దుటూరు రూరల్, చాపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 కిలోల 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. రూరల్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐలు చంద్రశేఖర్, చాపాడు ఎస్‌ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలసి మంగళవారం మైదుకూరు రోడ్డులోని మీనాపురం క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో మైదుకూరు వైపు నుంచి వస్తున్న స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే స్మగ్లర్లు వాహనం ఆపకుండా పోలీసులను గుద్ది చంపే ప్రయత్నం చేశారు.
తర్వాత వాహనాన్ని పోలీసులు వెంబడించగా రాళ్లు, కట్టెలతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో చుట్టుముట్టిన పోలీసులు అనంతరపురం జిల్లా, నార్పల మండలం, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ తిరుపాలరెడ్డి, కమలాపురం మండలం, కొండాయపల్లి గ్రామానికి చెందిన చెప్పలి గంగాధర్, బి.మఠం మండలం, రేకులకుంట గ్రామానికి చెందిన పెద్దపోతు వెంకటస్వామిలను అరెస్ట్ చేశారు. స్కార్పియోలో ఉన్న 102 కిలోలు కలిగిన 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాపాడు స్టేషన్ పరిధిలోని అల్లాడుపల్లె క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. మైదుకూరు వైపు నుంచి వస్తున్న కారును ఆపగా అందులో ఉన్న చాపాడు మండలం, ఖాదర్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ సింపతి ఫకృద్ధీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ఉన్న 148 కిలోల 8 చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరికి తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఏపీలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు.
సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందికి డీఎస్పీ ప్రశంసలు
ప్రాణాలకు తెగించి ధైర్యసాహసాలతో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన సీఐ ఓబులేసు, ఎస్‌ఐలు చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఏఎస్‌ఐలు అహ్మద్, నారాయణ, కానిస్టేబుళ్లు మధుసూదన్‌రెడ్డి, సుబ్బయ్య, లక్ష్మీపతిరెడ్డి, శంకర్, కమాల్‌బాషా, ఖాదర్, వెంకటసుబ్బయ్యలను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేస్తానని డీఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment