రోదిస్తున్న పెళ్లి కొడుకు ఆరీఫ్‌షరీఫ్
మరికొన్ని గంటల్లో ‘నిఖా’ (వివాహ వేడుక).. ఎంతో సంతోషంగా బంధుమిత్రులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఎంతో సందడిగా వెళ్తున్న ఆ పెళ్లి బృందం క్షణాల్లోనే క్షతగాత్రులుగా మారారు. అనుకోని విధంగా జరిగిన ప్రమాదంతో అప్పటి వరకు పెళ్లి వేడుకల సంబురంలో ఉన్న వారంతా ఆహాకారాలు.. రోదనలతో మృత్యు భయంతో వణికిపోయారు.
మహబూబాబాద్ రూరల్: ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి బోల్తా కొట్టిన పెళ్లిబృందం డీసీఎంను అటుగా వెళ్తున్న మరో గూడ్స్‌వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా, మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండా సమీపంలో సోమవారం జరిగిన ఘటన వివరాలు బాధితులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...
మహబూబాబాద్ మండలంలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఎండీ. హుస్సేన్‌షరీఫ్–నూర్జహాన్ కుమారుడు ఆరీఫ్‌షరీఫ్ వివాహం నెల్లికుదురు మండంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన అక్బర్–రజీయా కుమార్తె రిజ్వానాతో జరిపేందుకు నిశ్చయించారు. ఈ పెళ్లి బృందం మొత్తం ఒక డీసీఎం వాహనంలో జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండా మీదుగా మధ్యాహ్నం సమయంలో వెళ్తోంది.
అదే సమయంలో కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామ శివారు పెద్దతండాకు చెందిన కొర్ర వీరన్న తన ద్విచక్ర వాహనంపై ఏ క్యాబిన్ రైల్వేగేట్ నుంచి ఎదురుగా వేగంగా వచ్చాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్‌ను డీసీఎం వాహన డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అదుపుతప్పి పక్కన ఉన్న కంకర కుప్ప పైకి వెళ్లి పల్టీకొట్టింది.
అదే సమయంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన చాక్‌పీస్‌ల వ్యాపారి కూర పాటి బాబురావు, డ్రైవర్ గోసిక రాఘవేంద్ర గూడ్స్‌వ్యాన్‌లో అటువైపుగా వస్తున్నారు. ఒక్కసారిగా ముందు పడిన పెళ్లిబృందం డీసీఎంను వారు బలంగా ఢీకొట్టారు.
క్షతగాత్రులు వీరే..
ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు ఆరీఫ్ షరీఫ్ తండ్రి హుస్సేన్‌షరీఫ్ తలకు, గూడ్స్‌వ్యాన్ డ్రైవర్ గోసిక రాఘవేంద్ర తలకు తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న ఎస్‌కే.సమీర్, ఎండీ.అజీమ్‌కు చేతులు విరిగాయి. పసునూరి కరుణాకర్, ఉమేష్, పెండ్లి కొడుకు అన్న ఆసీఫ్, సాయి, శ్రావణ్, ఇమామ్ పాషా, యాకుబ్ పాషాకు స్వల్ప గాయలయ్యాయి.
వీరిని వెంటనే చికిత్స నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక డీసీఎం డ్రైవర్ తప్పించిన ద్విచక్రవాహనదారుడు కొర్ర వీరన్న వ్యాన్ వెనుకవైపు ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందాడు.
హాహాకారాలు..రోదనలు...
పెళ్లి బృందం డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటన స్థలంలో ఆహాకారాలు.. రోదనలు మిన్నంటాయి. ప్రమాదం జరుగగానే రోడ్డు అడ్డంగా వాహనం పడిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పెళ్లి బృందం వారికి ప్రమాదం జరిగిందని వార్త తెలియగానే ఘటన స్థలానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గూడ్స్‌వ్యాన్ డ్రైవర్ రాఘవేంద్ర అందులోనే ఇరుక్కుపోగా పోలీసులు, స్థానికులు అతడిని అతి కష్టం మీద బయటకి లాగి ఆస్పత్రికి తరలించారు. డీసీఎం వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. సమయ స్ఫూర్తితో డ్రైవర్ అందులో నుంచి బయటకు వచ్చాడు.
టౌన్ ఎస్సై అరుణ్‌కుమార్, ట్రాఫిక్ ఎస్సై సిరిసిల్ల అశోక్, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. మండల మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫక్రూద్దీన్, సర్పంచ్ షఫీయుద్దీన్, టీఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని మురళీ క్షతగాత్రులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment