ఈడిగ అనసూయమ్మ మృతదేహం బోయ రాములమ్మ మృతదేహం
గద్వాల క్రైం: మరో అయిదు నిమిషాలైతే ఆ మహిళా కూలీలు వారి ఇంటికి చేరుకునేవారు. ఉదయం నుంచి కూలీపనిలో ఉన్న వారు వాహనంలో బయలుదేరి ఇంటివద్ద ఉన్న భర్త, పిల్లలను గుర్తు చేసుకున్నారు. ఇంటికెళ్లి చేయాల్సిన పనుల గురించే మాట్లాడుతున్నారు. ఇంతలోనే మృత్యువు మరో వాహనరూపంలో ఎదురుగా దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఎగిరి మృత్యుశకటం చక్రాల మధ్య పడి ప్రాణాలొదిలారు. నిమిషం వ్యవధిలో విగతజీవులుగా మారారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు, టాటాయేస్ డ్రైవర్ కథనం ప్రకారం ఆ వివరాలు... గద్వాల మండలం జమ్మిచేడు గ్రామానికి చెందిన ఈడిగ అనసూయమ్మ(41), బోయ రాములమ్మ (40)తో పాటు అదే గ్రామానికి చెందిన మరికొంత మంది (10మందికి పైగా) మహిళా కూలీలు, పట్టణ శివారులోని ఓ జిన్నింగ్ మిల్లులో పత్తి గింజలు వేరు చేసే కూలిపనికి వెళ్తున్నారు.
అయితే రోజులాగే మంగళవారం కూడా టాటాయేస్ వాహనంలో పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి 7.15 గంటల సమయంలో ఇంటికి వాహనంలో వస్తున్నారు. ఇద్దరు ఓ వైపు నిల్చుని ఉన్నారు. గద్వాల నుంచి అయిజ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం కొండపల్లి మలుపు వద్ద వేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టింది. దీంతో టాటాయేస్ వాహనంలో నిల్చుని ఉన్న ఇద్దరు మహిళలు గుర్తుతెలియని వాహనం చక్రాల కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వీరితోపాటు రుక్మిణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన మహిళా కూలీలు కేకలు వేస్తూ గట్టిగా రోదించారు. స్థానికులు గమనించి వారిని వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో జమ్మిచేడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం
ప్రమాద వార్త తెలియడంతో జమ్మిచేడు గ్రామస్తు లు, బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ వారిని చూసుకుని గుండెలవిసేలా రోధించారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగింది. అనసూయమ్మ భార్త రాములు, రాములమ్మ భర్త బీసన్న ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మా ర్చురీలో భద్రపర్చారు. కూలీలు మృతి చెందారన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్, బీఎస్పీ తదితర పార్టీల నాయకులు బాధిత కుంటుబాలను ఓదార్చారు. అన్నివిధాలా ఆదుకుంటామని బంధువులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment