ప్రశాంత్ మృతదేహంతో ధర్నా చేస్తున్న బంధువులు ప్రశాంత్(ఫైల్)
చిగురుమామిడి(హుస్నాబాద్) : వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న యువకుల బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ట్రాక్టర్ యజమాని ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలు పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం. గాగిరెడ్డిపల్లికి చెందిన ప్రశాంత్ తన స్నేహితుడు భిక్షపతితో కలిసి శనివారం బెజ్జంకి మండలం రేపాక గ్రామానికి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.
శనివారం రాత్రి దాదాపు 8.30 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి తిరుగు ప్రయణమయ్యారు. ఈక్రమంలో చిగురుమామిడి శివారులోని ఊరచెరువు కట్టకింద లంబాడిపల్లికి వెళ్లేదారిలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్, భిక్షపతి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను కరీంనగర్‌కు ప్రైవేటు వాహనంలో తరలించారు. చికిత్స పొందుతూ కూన ప్రశాంత్ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. ప్రశాంత్ మల్లవ్వ–బాలయ్య దంపతుల చిన్నకుమారుడు. యువకుడికి పెళ్లి కాలేదు. పదోతరగతి వరకు చదువుకుని ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు.
ప్రశాంత్ దుర్మరణం తట్టుకోలేక కోపోద్రిక్తులైన బంధువులు మృతదేహంతో ట్రాక్టర్ యజమాని కాటం రాజిరెడ్డి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ ధర్నా కొనసాగించారు. చిగురుమామిడి ఎస్సై సత్యనారాయణ అక్కడికి చేరుకుని ప్రశాంత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాజిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment