ప్రమాదంలో నుజునుజ్జయిన బస్సు. చిత్రంలో రెండు మృతదేహాలు, బస్సులో చెల్లాచెదురైన మృతదేహాలు
సాక్షి ముంబై: 23 మందితో తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగి వస్తున్న మినీ ట్రావెల్ బస్సు రోడ్డుపై ఉన్న ఇసుక ట్రక్కును ఢీ కొనడంతో బస్సులో ఉన్న 10 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన నాసిక్ జిల్లా చాంద్‌వడ్ తాలూకా సోగ్రాస్ గ్రామం వద్ద గురువారం వేకువ జామున 5.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల వివరాలు పూర్తిగా తెలియరాలేదు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, ఓ బాలుడున్నారు. మరణించిన వారందరూ కల్యాణ్, ఉల్లాస్‌నగర్‌తోపాటు నాసిక్ వాసులుగా గుర్తించారు.
తెల్లవారు జామున..
సాయిట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సులో డ్రైవర్‌తోపాటు మొత్తం 23 మంది సోమవారం తీర్థయాత్రలకు బయలుదేరారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజాము వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. తెల్లవారుతుండటంతో నిద్రలోనుంచి అçప్పుడప్పుడే కొందరు మేల్కొనసాగారు. అంతలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దం.. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఆ పరిసరాలన్నీ రక్తపు మడుగులో ఎర్రగా మారిపోయాయి. క్షతగాత్రుల అర్తనాధాలతో ఆ పరిసరాలన్నీ మారుమోగాయి. ఇలా సూర్యోదయం చూడకముందే ఘటనా స్థలంలోనే ఐదుగురు విగత జీవులయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానికులు, ఇతర వాహన చోదకుల సహాయంతో గాయపడ్డ వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మరో ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన 13 మందిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నాసిక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఉల్లాస్‌నగర్‌కు చెందిన మినీ బస్సు డ్రైవర్ సంతోష్ పిఠలే (38)కూడా ఉన్నారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయాలైన వారిలో కాలిదాస్ వాసోదా (38) రాధీ రాఠోడ్ (40), జమునా చవాన్ (70), మంజూ గుజరాతీ (31), ప్రగతీ గుజరాతి (12, కాశిక్ ధావ్ (14), కల్యాణ్ గుజరాత్ (60), ధనూ పరమార్ (60), వసూదుమయా (54), బ్రిజేష్ మల్హోత్రా (20), అజయ్ మల్హోత్రా (45), డ్రైవర్ సంతోశ్ పిఠలేతోపాటు ట్రక్కు క్లీనర్ మాలీకిలు ఉన్నారు.
టైర్ పగలడంతోనే....?
మినీ బస్సు టైరు పగలడంతోనే ఈ సంఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు మొరాయించడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మతులు చేయసాగారు. అయితే అంతలోనే వేగంగా వస్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీ కొట్టింది. టైర్ పగలడంతో మినీ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని దీంతోనే ట్రక్కును ఢీ కొట్టిందని తెలిసింది. దీంతో దైవ దర్శనానికి వెళ్లి.. చివరికి మృత్యు ఒడిలోకే వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment