ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు, క్షతగాత్రులు
వారంతా వివిధ పనులపై బయలుదేరారు. సమయానికి టాటా ఏస్ వాహనం రావడంతో అందులో ఎక్కారు. ఆ వాహనం ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి వెళ్తోంది. కోటేకల్ కొండల మలుపులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కుదుపు.. ఏం జరుగుతోందో ప్రయాణికులు తెలుసుకునేలోపే కంటైనర్ లారీ వచ్చి ఢీకొట్టింది. అదే వేగంతో రోడ్డుపక్కనున్న కల్వర్టు గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.
కర్నూలు ,ఎమ్మిగనూరు రూరల్: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామసమీపంలోని కొండల మలుపు దగ్గర మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం ధార్వాడ నుంచి పొక్లెయిన్‌ను తీసుకుని గుంటూరుకు వెళ్తున్న కంటైనర్ లారీ (ఏపీ 16టీఎక్స్ 8339).. ఎమ్మిగనూరు నుంచి ప్రయాణికులతో ఆదోనికి బయలుదేరిన టాటా ఏస్ వాహనాన్ని(ఏపీ02 టీవీ 0771) ఎదురుగా ఢీకొట్టింది. మలుపులో లారీ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢీ కొట్టిన వెంటనే కంటైనర్ పక్కనే ఉన్న కల్వర్టు గుంతలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న కోటేకల్‌కు చెందిన హరిజన కర్రెమ్మ(58), బోయ అంజినమ్మ(50), బనవాసి ఫారానికి చెందిన ఖాదర్‌బాషా(45), డ్రైవర్ భీమలింగారెడ్డి(37) అక్కడికక్కడే మృతి చెందారు.
అంజనయ్య, శివరామాచారి, సాల్మన్‌రాజు, అన్వర్‌బాషా, ఈరన్న, శివమ్మ, జయమ్మ, నూర్‌మహమ్మద్, విజయలక్ష్మీ, దేవదాస్, ఉపా«ధ్యాయుడు ప్రభుదాస్ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వివిధ ప్రాంతాలకు చెందినవారు. క్షతగాత్రులను వెంటనే పోలీసు రోడ్ సేఫ్టీవాహనం, 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ జీ.ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆదోని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ కూడా హుటాహుటిన ప్రమాద స్థలానికి వచ్చారు. వాహనంలో ముందు కూర్చొని ప్రాణాలతో బయటపడిన ఉపాధ్యాయుడు ప్రభుదాసుతో ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. వాహన డ్రైవర్ మృతదేహం స్టీరింగ్ దగ్గర ఇరుక్కుపోవటంతో పోలీసులు, స్థానికులు కలసి డోర్ తొలగించి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.
ముంబాయికి వలస వెళ్తూ..
కోటేకల్ గ్రామానికి చెందిన హరిజన కర్రెమ్మ సోమవారం నూతన సంవత్సర వేడుకలు చేసుకుంది. రెండు రోజుల తరువాత వెళ్దువులే అని కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా ముంబాయికి బతుకు దెరువుకోసం బయలుదేరింది. తల్లిని రైలు ఎక్కించేందుకు కుమారుడు దేవదాస్ కూడా ఆ వాహనంలోనే ఆదోనికి బయలుదేరాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావటంతో కర్రెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు దేవదాసుకు తీవ్రగాయాలయ్యాయి.
12 సార్లు రక్తదానం చేసిన భీమలింగారెడ్డి
ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన టాటా ఏస్ డ్రైవర్ భీమలింగారెడ్డి(38) ఇప్పటి వరకు 12 సార్లు రక్తదానం చేశాడు. బీ–నెగిటివ్ గ్రూప్ రక్తం అవసరమని ఎవరు ఫోన్ చేసినా..ఏ సమయంలోనైనా వెళ్లి ఇచ్చేవాడని స్నేహితులు లక్ష్మణ్‌సాగర్, తిరుమల్ తెలిపారు. వాహనాన్ని ఎమ్మిగనూరు–ఆదోని మధ్య తిప్పేవాడు. భీమలింగారెడ్డి మృతితో భార్య సంధ్య స్పృహతప్పి పడిపోయింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఇతనికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అలాగే బనవాసిఫారానికి చెందిన ఖాదర్‌బాషాకు భార్య హసమత్‌బాను, నలుగురు సంతానం. ఇతను ఫారంలో చిన్నపాటి హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తుండేవాడు. పనినిమిత్తం ఆదోనికి వెళ్తూ ప్రమాదంలో మృతిచెందాడు. బోయ అంజినమ్మ(50)ది కూడా పేదకుటుంబం. ఈమె కూడా సొంత పని నిమిత్తం ఆదోనికి బయలుదేరి..ప్రమాదానికి బలైంది.
బాధితులను పరామర్శించిన నేతలు
క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీపీ వాల్మీకి శంకరయ్య, నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఖర్చుల కోసం మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆర్థిక సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment