ఆ నలుగురూ స్నేహితులు. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. కొద్దిరోజుల తర్వాత మొహర్రం పండగ సందర్భంగా కలిశారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు సందడి చేశారు. వారి సంతోషం కాసేపటికే ఆవిరైంది. ఇంటికి చేరేలోపే వారిలో ముగ్గురు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
సాక్షి, రాపూరు (నెల్లూరు): మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందడంతో రాపూలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురూ ప్రాణస్నేహితులే. వివరాలిలా ఉన్నాయి. రాపూరుకు చెందిన జిలానీకి ముగ్గురు కొడుకులు. ముగ్గురు కుమార్తెలు. షోకత్ అలీ (18) చివరి సంతానం. అలీ నెల్లూరులో గ్లాస్ ఫిట్టింగ్, బంగారు పనిచేసేవాడు. బేల్దారి పనిచేసే అల్తాఫ్ కుమారుడు సయ్యద్ అజీమ్ (18). ఇతను రాపూరులో పండ్ల దుకాణంలో పనిచేసేవాడు. బేల్దారి కూలీగా పనిచేసే పి.అంకయ్య కుమారుడు పిల్లి అశోక్ (19) స్థానికంగా స్టీల్ దుకాణంలో పనిచేసేవాడు. టైలరింగ్ వృత్తి చేసే రఫీ కుమారుడు మస్తాన్ నెల్లూరులోని బంగారం పనిచేసేవాడు. వీరివి పేద కుటుంబాలు.
సోమవారం సాయంత్రం నలుగురూ కలిశారు. రాత్రి అశోక్ బైక్‌లో రాపూరు మండలంలోని ఓబులాయిపల్లి గ్రామంలో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు. అగ్నిగుండం మహోత్సవాన్ని చూసి పెంచలకోనకు చేరుకున్నారు. అక్కడినుంచి తెల్లవారుజామున మూడుగంటల సమయంలో అశోక్ బైక్ నడుపుతుండగా రాపూరుకు బయలుదేరారు. అతివేగం కారణంగా పెంచలకోన నుంచి గోనుపల్లి మార్గమధ్యలో ఉన్న మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడింది. దీంతో షోకత్ అలీ, అజీమ్, అశోక్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మస్తాన్ రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో చికత్స పొందుతున్నాడు. మస్తాన్‌ను 108 అంబులెన్స్‌లో వైద్యశాలకు తీసుకెళుతుండగా పెనుబర్తి గ్రామ సమీపంలో మరమ్మతులకు గురైంది. దీంతో అతడిని ఆటోలో తరలించారు.
తల్లడిల్లిన కుటుంబసభ్యులు
మంగళవారం ఉదయం యువకుల మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువకులు పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూరు వైద్యశాలకు తరలించగా వారంతా అక్కడికి చేరుకున్నారు. ఇంటి నుంచి ఆనందంగా వెళ్లిన పిల్లలు విగతజీవులుగా మారడంతో తల్లడిల్లిపోయారు. మృతులు సయ్యద్ అజీమ్, షోకత్‌అలీ ఒకే కుటుంబానికి చెందివారు. అన్నదమ్ముల పిల్లలు.
డీఎస్పీ పరిశీలన
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ భూమన హర్షవర్ధన్‌రెడ్డి, వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా, రాపూరు ఎస్సై కోటిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ మాట్లాడుతూ అతివేగమే ప్రమాదానికి కారణమన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
వైద్యశాల వద్ద మృతుల కుటుంబసభ్యులు, బంధువులు
Comments
Please login to add a commentAdd a comment